పుట:Naajeevitayatrat021599mbp.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రోజులలో అధికారంలో ఉన్న మహాశయుల పద్ధతులవి! అందులో కాంగ్రెసు నాయకుల కోర్కెల విషయంలో వారి వక్రబుద్దే బలిష్టమయ్యేది. కాంగ్రెసువారు ఇటువంటి కష్టాలన్నింటినీ భరించారు.

తరవాత రాజ్యాంగయంత్రం వారి హస్తగతమై రెండున్నర సంవత్సరాలు వారి చేతులలోనే నిలిచింది. "కాంగ్రెసు గవర్నమెం"టనే శీర్షిక కింద, కాంగ్రెసు మంత్రులు రాజకీయ ఖైదీల విషయంలో ఎల్లా ప్రవర్తించారన్న విషయం వివరంగా చర్చిస్తాను.

ఒక్క విషయం మాత్రం నిజం. రాజకీయ ఖైదీల అగచాట్ల విషయంలో కాంగ్రెసు మంత్రులు ఏవిధంగానూ కలుగజేసుకోలేదు. వారి బాధలు గుర్తించలేదు. ఒక్క మజ్జిగమాత్రం సప్లయి చెయ్యడానికి అనుమతి ఇచ్చారు. అంతే!

కాంగ్రెసు గవర్నమెంట్‌లో మంత్రులుగా ఉన్న మహాశయులు ఇతర కాంగ్రెసు వారితో సహా తిరిగి 1941 లో జెయిళ్ళకు వెళ్ళారు. వారు తిరిగి జెయిళ్ళకు వెళ్ళినప్పుడు వారి స్థితి స్వయంకృతాపరాధంగానే తయారైంది. ఏదో సామెత చెప్పిన తరువాయిగా, నీరు చాలా ఉండే అనపకాయ బీరకాయలాంటి కూరలు నీళ్ళు పొయ్యనవసరం లేకుండానే వాటి రసంలోనే అవి ఉడికినట్లు, ఆంగ్లంలో 'Stew in their own juice' అని చెప్పబడే స్థితి వారికి సంప్రాప్తమైందన్నమాట! అత్తగారి స్థానంనుంచి కోడలు స్థానానికి దిగజారిపోయినట్లే గదా! ఆ కాంగ్రెసు మంత్రులే తిరిగి జెయిళ్ళకు వెళ్ళినప్పుడు వారికి అనుభవమైంది. మంత్రులుగా తాము రాజకీయ ఖైదీలకు తమ హృదయాలలో ఏవిధమయిన స్థానమూ ఇవ్వకపోవడం బాగా తెలిసివచ్చింది. ఈ పరిస్థితులను గురించి ముందు ముందు వివరిస్తాను.

వెల్లూరు జెయిల్లో నీటి ఎద్దడి

తిరుచ్చీ జెయిలులో రాజకీయ ఖైదీలను గురించి కొన్ని మాసాలుగా ఆందోళన జరుగుతూన్న కారణంగా, మమ్మల్ని వెల్లూరు జెయిలుకు మార్చారు. వెల్లూరులో మాకు మంచి ఆహారం లభిస్తుందనీ,