పుట:Naajeevitayatrat021599mbp.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'పిండా కూడు'

'క్వారంటైన్‌' కాలంలో మాకు అన్నపు ముద్దలు - పిండాలు, రసమూ - కొళంబూ అని పిలువబడే ఏదో చిక్కని ద్రవమూ ఆహారంగా లభించేవి. నిజానికి ఆ ఆహారం ఎటువంటి మానవునకయినా ఆరోగ్యదాయకం అని చెప్పడానికి వీలులేని స్థితిలోనే ఉండేది. కొళంబులో నిజంగా వాడవలసిన కూరలూ, పప్పులూ విచిత్రంగా మాయమయి, వాటి స్థానంలో యేదో ఇంత తుక్కూ, గడ్డీ ఉపయోగింపబడేవి. ఇట్టి కారణాల వల్లనే ఖైదీలలో చాలామందికి ఆరోగ్యం దెబ్బతింది. ఆ అన్నపు ముద్దలలో రాళ్ళు రప్పలే కాదు, పురుగులుకూడా ఉండేవి. అటువంటివి కంటబడినప్పుడు నిరాహారంగా రామభజన చేసేవారం. క్రమేణా మాలో ఇరువురు వ్యక్తులకు వంట ఏర్పాట్లు చూడడానికి అనుమతి లభించడమూ, కాస్త మంచి ఆహారం లభ్యం చేయబడడమూ జరిగింది. కార్నిష్‌గారూ, వారి పై అధికారులూ ఒప్పుకున్న కారణంగా మా ఆహారస్థితి మెరుగున పడింది.

మామూలుగా నేరస్తులకోసం జెయిళ్ళు అన్నవి సృష్టించబడిన నాటినుంచీ చల్ల (మజ్జిగ) ఖైదీల కివ్వడ మన్నది ఆచారంలో లేని విషయమే 1921 లో మొదటి సత్యాగ్రహం, శాసన ధిక్కారాదులు జరిగిన నాటినుంచీ రాజకీయ ఖైదీలకుకూడా ఈ మజ్జిగ అన్నది ఎప్పుడూ సప్లయి చేయబడలేదు. కాంగ్రెసు మిత్రులు, అధమం రాజకీయ ఖైదీలకైనా మజ్జిగ సప్లయి చేయించాలని, ఆనాటినుంచీ తంటాలు పడ్డారు.

జస్టిస్ పార్టీ 'మహాశయులు'

కాని జస్టిస్ పార్టీవారు చెప్పేశారు - కాంగ్రెసు సత్యాగ్రహులకూ, మామూలు ఖైదీలకూ తేడా అనేది పాటించడం సబబు కాదని. అందువల్ల వారికి ఏవిధమయిన అదనపు సౌకర్యాలూ ఇవ్వబడవని ఖచ్చితంగా చెప్పేశారు. ఇంకో జస్టిస్ పార్టీ మహాశయుడు భారతీయ ఆహార విధానంలో మజ్జిగ అన్నది అవసరమైన ఆదరవు కాదన్నాడు. ఆ