పుట:Naajeevitayatrat021599mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరసకి, మా నాయనగారు ఏ పెద్దబళ్ళళ్ళోనూ చదవలేదు. ఏ డిగ్రీలు సర్టిఫికెట్టులూ పొందలేదు. జీతం ఎనిమిదిరూపాయలైనా. అప్పట్లో ఆయన ఆ చదువుతోటే ఎనిమిది ఊళ్ళపైన రెవిన్యూ అధికారు చేసి జీవనం చెయ్యగలిగారు. ఆ చదువు ఉపాధికి మార్గంగా ఉండేది. మా నాయనగారు చిన్ననాడు చదువుకున్న భారత భాగవతాలు నిరంతరమూ పారాయణ చేస్తూ, తమ ఆత్మోద్ధరణకి కృషి చేస్తూ వుండేవారు. మా అమ్మమ్మగారు, పెద్దత్తగారు ఎక్కువ చదువుకోకపోయినా, భారత భాగవత రామాయణాదికథలు యావత్తూ కంఠస్థంగా నేర్చుకుని, మమ్మల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని అవన్నీ ఉపదేశం చేసేవారు. ఆ విద్యా విధానపు ఆదర్శం జాతీయమైనది; విశాలమైనది. ఈ నూతన విద్యకి ఆదర్శం నౌఖరీ, ధనసంపాదనా, స్వార్థమూనూ.

ఎప్పుడైతే మిడిల్‌స్కూళ్ళ చదువు పూర్తిచేసినవాళ్లూ, మెట్రిక్యులేషన్ పాసైనవాళ్లూ కూడా పెద్దపెద్ద ఉద్యోగస్థులై అమితంగా ధన సంపాదనలో పడ్డారో, అప్పుడే దేశంలో విద్యాదర్శాలు క్షీణించాయి. ఆంగ్లేయ పాలకులు కూడా తమ రాజ్యానికి వేళ్ళు పారించడానికి మన దేశీయ సంస్థల నన్నింటినీ క్రమక్రమంగా పెకలించారు. ఆ రోజుల్లో పంచాయతీ పద్ధతిని న్యాయ నిర్ణయం చేసుకోవడం అమలులో ఉండేది. ఆ పద్ధతి తొలగించి కోర్టుల పద్ధతి స్థాపించారు. దాంతో కాని మన పతనం ప్రారంభంకాదు. ఆ కోర్టులకీ జడ్జీలూ, వకీళ్ళూ కావాలి గదా! అందుకోసం ముందుగా ఆంగ్లేయ పాలకులు మన సంఘంలో వుండే పెద్దల్ని ఏరి, వాళ్ళకి పెద్దపెద్ద పదవులుఅంటగట్టారు. క్రమంగా కొంచెం చదువు - అంటే ఏ మిడిల్‌స్కూలు చదువో - చదువుకుంటే జిల్లా మునసబీ అయ్యేది. అందుచేత దేశంలో వివేకవంతు లనబడే వాళ్ళ దృష్టి అటు మళ్ళింది. జనం ఇంగ్లీషు చదువులికి తియ్య నీటికి చేప లెక్కినట్లు ఎక్కారు. క్రమంగా మెట్రిక్యులేషను పాసయిన వాళ్ళ సంఖ్యా, ఎఫ్. ఏ. ల సంఖ్యా, బి. ఏ. ల సంఖ్యా పెరిగింది. దాంతో పాలకులు ప్లీడరీలకీ, నౌకరీలకీ అర్హతలు ఏర్పరిచారు. అప్పట్లో ఈ చదువుల్లోకి వెళ్ళినవాళ్ళంతా ఉద్యోగస్థులై