పుట:Naajeevitayatrat021599mbp.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీదికి దాడివెళ్లే వాలంటీర్లను పోలీసువారు అరెస్టుజేసి తీసుకుపోతూ, ఆ నదిని దాటి శిబిరాన్ని ఆక్రమించుకుని వాలంటీర్లకు తావులేకుండా చేశారు. నది ఆవలిగట్టునుంచి వాలంటీర్లు ఆకొఠార్లమీదికి దండెత్తారు. అక్కడ సమీపంలో ఉన్న ఒక చిన్న గుడిసెను వారు శిబిరంగా మార్చుకున్నారు. పోలీసువారు తాము ఆక్రమించుకున్న శిబిరాన్ని వదలి, ఒక్క ఉదుటున ఈ వాలంటీర్ల నూతన శిబిరం మీదికి దండెత్తారు. ఈ అదునులో నదికి అవతలి గట్టునుంచి వచ్చే వాలంటీర్లు ఆ శిబిరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఆ ఉద్యమం అక్కడ జరుగుతూన్న రోజులలో అల్లా ఆ శిబిరం వాలంటీర్ల చేతులలోంచి పోలీసువారి చేతులలోకి, పోలీసువారి చేతులలోంచి కాంగ్రెసువారి చేతులలోకి చాలాసార్లే మారింది. నాయకులు ఆ జిల్లా ఇతర ప్రాంతాలలోని పనులకు ఆటంకం కాని రీతిని, ఈ క్యాంపుపైనే ఎక్కువ దృష్టి పెట్టి, అక్కడ జరుగుతూన్నా పోరుకి సలహాలూ, సహకారమూ అందించేవారు.

సాధారణంగా ఇటువంటి వింత సంఘటనలు చూడడానికి జనం గుంపులు గుంపులుగా వస్తారుగదా! వారు చాలా శాంతియుతంగానూ, క్రమశిక్షణతోనూ మెలిగారు. ఆ ప్రాంతంలో నివసించే పల్లెవాళ్ళకి కూడా ఉప్పు సత్యాగ్రహం ఆవశ్యకత, ప్రభుత్వంవారు ఉప్పులాంటి అత్యవసర వస్తువులపై కూడా పన్ను విధించి, ఎల్లా బీదవారి పొట్టమీద దెబ్బ కొడుతున్నారో అర్థం అయింది. నిజానికి ప్రజలే గుంపులు గుంపులుగా ఉద్యమంలో చేరి, దానిని మంచి ధీమాతో నడిపించి జయం సాధించారు.

కమలాదేవి చాక చక్యం

కాకినాడ కాపురస్థురాలు కీ॥ శే॥ వేదాంతం కమలాదేవి, వందలూ వేలూ జనం గుంపులు గుంపులుగా తనవెంటరా, ఉద్యమాన్ని మాంచి పకడ్‌బంద్‌గా నడిపించింది. ఆమె చాలా దైర్యసాహసాలు గల ఇల్లాలు. ఆరుగురు బిడ్డల తల్లి. ఆమె ఆంధ్రదేశంలో పలు