పుట:Naajeevitayatrat021599mbp.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖైదులో అనారోగ్యం

అరెస్టయి జెయిలుకి వెళ్ళేముందు ఆ పదిహేను రోజులలోనూ నేను రాత్రింబవళ్ళు కాలినడకని పట్నం మూలమూలలా తిరుగుతూ వచ్చాను. ఆ రోజులలో ఉన్న ఉత్సాహం కారణంగా ఏవిధమయిన నీరసమూ, శోషా ఎరగను. అప్పట్లో నాకు శరీరంలో తాపం అధికం అవుతూన్న అనుమానమే కనబడలేదు. నన్ను పెనిటెంషరీలో పెట్టిన కొద్ది రోజులలోనే తలమీదా, ఒంటిమీదా కురుపులూ, సెగ్గెడ్డలూ బయల్దేరాయి. అక్కడ ఉన్న ఒక ఆస్పత్రి గదిలోకి వైద్యంకోసం నన్ను మార్చారు.

అంతవరకూ, నిజంగా, నాకు ఏవిధమయిన వైద్యవిధానంతోటీ అంతగా అవసరం కలుగలేదు. ఎప్పుడయినా అవసరం అని తోస్తే లూయీ ఖూనే గారి తొట్టి వైద్యం అనుసరిస్తూ ఉండేవాణ్ణి. ఆ ప్రకారం అప్పటికి ఇరవై అయిదు సంవత్సరాలుగా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కాలక్షేపం జేశాను. ఖైదీగా నాకు తొట్టిగాని, కావలసిన నీళ్ళుగాని లభ్యం కాలేదు. అక్కడి ఆ పెనిటెంషరీలో నన్ను కొద్దికాలమే ఉంచుతారనికూడా తెలుపబడింది.

నిజానికి పెనిటెంషరీలో మమ్మల్ని కొద్ది వారాలపాటే ఉంచారు. ఈ రోజులలో పత్రికా ముఖంగా జరుగుతూన్న చరిత్ర నాకు తెలుస్తూనే ఉంది. కాల్పులను గురించీ, లాఠీఛార్జీలను గురించీ వివరంగా వార్తలు గ్రహిస్తూనే ఉన్నాను. ఉద్యమం సఫల మవుతోందని గ్రహించి చాలా గర్వం చెందాను. ప్రజలలోని ఉత్సాహమూ, కార్యదీక్ష, అఖండ దేశభక్తి ఉద్యమానికి బలం చేకూర్చాయి. స్త్రీలూ, పురుషులూ కూడా తమకు తాముగానే నాయకత్వాలు వహించి ఉద్యమానికి చేయగలిగిన సేవచేయడం ఆరంభించారు.

నన్ను పెనిటెంషరీనుంచి తిరుచిరాపల్లి జెయిలుకు మారుస్తున్నారన్న వార్త ఎల్లా పొక్కిందో తెలియదుగాని, ఆనాడుమాత్రం రైల్వేస్టేషన్ అంతా ప్రజాసమూహంతో నిండిపోయింది. ఆ ప్రజా కోలాహలంనుంచి నన్ను తప్పించి, తేలికగా రైలు ఎక్కించడానికిగాను,