పుట:Naajeevitayatrat021599mbp.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న మీటింగులోకూడా కాల్పులు జరిపారు. ఈ చర్యలన్నీ ప్రజలలో భీతిని ఉప్పతిల్ల జేసి, ఉద్యమాన్ని అణగద్రొక్కాలనే ప్రయత్నంతోనే చేయబడ్డాయి.

అదే ప్రకారంగా చెన్నరాష్ట్రంలోని పలు జిల్లాలలోనూ, తాలూకాలలోనూ కాల్పులూ, లాఠీ చార్జీలు విరివిగా జరుపబడ్డాయి.

ఈ ఉప్పు సత్యాగ్రహ కారణంగా, చెన్నరాష్ట్రంలో మొత్తం పదహారుసార్లు కాల్పులు జరిగాయి. ఎన్నో జాగాలలో , అన్యాయంగా, ఏ పాపమూ ఎరుగని సాధారణ జనసమూహాలపై గూడా లాఠీఛార్జీలు జరిగాయి. అంతేగాదు, ఆ లాఠీచార్జీ చేసేవారు కూడా చాలాసార్లు తాము చేస్తున్న పనికి సిగ్గు చెందిన సందర్భాలూ ఉన్నాయి.

జెయిళ్ల పాలైన స్త్రీలు

ఇలా చాలా నెలలపాటే ఈ సత్యాగ్రహ సమరం సాగింది. చాలామంది సత్యాగ్రహుల్ని నేను ఉన్న జైలుకే పంపించారు. అల్లా అరెస్టయి, శిక్షించబడిన వారిలో ఎందరో అమానుషమయిన లాఠీఛార్జీలకు గురైనవా రున్నారు.

పురుషులనే కాదు, ఎంతోమంది స్త్రీలనుకూడా అమానుషంగా హింసించి జెయిళ్ల పాలు జేశారు.

ఎన్ని వందలమంది సత్యాగ్రహులను ఈ విధంగా అరెస్టు చేశారో వివరంగా చెప్పడం ఎవరితరమూ కాదు.

మదరాసు నగరవాసులు మాత్రం ఆ కష్టకాలంలో తట్టుకుని ఉద్యమాన్ని సాగిస్తూనే వచ్చారు. అంతేకాదు, ఉద్యమం సాంతం అయ్యేవరకూ ఆ ఉదయవనం క్యాంపునకు కావలసిన ధన దాన్యాలన్నీ సమృద్ధిగా సప్లయి చేశారు. అప్పట్లో వారిని అభినందించాను. ఇప్పుడు కూడా వారిని అభినందిస్తున్నాను. దేశానికి దాస్య విముక్తి కలిగించే ఈ ఉద్యమంలో పాల్గొని, దేశమంటే వారికి ఉన్న అభిమానం, గౌరవం, భక్తీ కనబరచిన వేలాది ప్రజల్ని అప్పుడూ, ఇప్పుడూ కొనియాడడం మన విథే గదా!