పుట:Naajeevitayatrat021599mbp.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైతుకు వ్యవసాయాది ఖర్చులుపోను మంచి ఆదాయం లభిస్తోందనీ ఇంకా ఏవయినా పన్నులు వెయ్యవలసివస్తే , అతనికి కష్టంగాని నష్టంగాని ఉండదనీ తేలుతూంది.

అందువల్ల మా తంటాలన్నీ ఆ సెటిల్మెంట్ ఆఫీసరుగారి రిపోర్టు ప్రభుత్వంవారు త్రోసిపుచ్చేటట్టు చెయ్యాలని.

ఘనంగా సాగిన మా అలజడి సత్పలితాలనే యిచ్చింది. అధికంగా విధించబడిన పన్నులు ఏ పరిస్థితిలోనూ, ఎంత మాత్రం చెల్లించ మని రైతులు నొక్కి వక్కాణించారు. పింఛను పుచ్చుకుని వెళ్ళి పోయిన తర్వాత కూడా గవర్నర్‌గా పనిచేసి విరమించిన విల్లింగ్‌డన్ ప్రభువు బోటివారికి మరపురాని విధంగా సాగిన మా గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమం మదరాసు గవర్నమెంట్‌వారు లోగడ రుచిచూసే ఉన్నారు.

పెంచిన పన్నుల వాయిదా

పరిసర జిల్లాలవారు కూడా ఆనాడు చూపించిన అభిమానం, వగైరాలన్నీ గ్రహించిన మద్రాసు ప్రభుత్వంవారు ఈ రీసెటిల్మెంట్ విషయంలో మిగిలిన కార్యక్రమం యావత్తూ విరమించుకున్నారు. ఆ సెటిల్‌మెంట్ ఆఫీసరు సూచన ప్రకారం, ఏటా 17 లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. కాని దాని వసూలు మా ఆందోళన ఫలితంగా నాలుగు సంవత్సరాలపాటు వాయిదా పడింది.

నేను కేంద్ర శాసన సభా సభ్యుడుగా ఉంటూన్న రోజులలో సేకరించిన ఈ సమాచారమంతా ప్రజల్ని ప్రత్యక్ష చర్యకి తయారు చెయ్యడానికి ఉపకరించింది. మదరాసు ప్రభుత్వంవారు వేసిన అదనపు పన్నులు ఆపు చెయ్యడానికీ ఉపకరించింది.

ఈ విషయంలో నేను చాలాసార్లు కాంప్‌బెల్‌ను కలుసుకున్నాను. గవర్నమెంట్ ఒత్తిడి చేస్తే, ప్రజలు పన్నుల నిరాకరణకి సిద్ధం అవడానికి సావకాశం ఉన్నదని కాంప్‌బెల్‌ను నమ్మించగలిగాను. ఈ విషయం నేను కేవలం కాంగ్రెసు నాయకుడిగా మాత్రమేగాక, కేంద్ర శాసన సభా సభ్యుడిగా కూడా నమ్మకంగా చెప్పగలనని హెచ్చరిక