పుట:Naajeevitayatrat021599mbp.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశం అంటే ఆంధ్ర అన్న స్థాయికి నా రాష్ట్రీయులూ, నేనూ వచ్చేశాం అన్నమాట! సుమారు ఇరవై సంవత్సరాలపాటు రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ అధ్యక్ష స్థానం వహించి ఉండడాన్ని, రాష్ట్రీయలందరి ఆదరాభిమానాలను పూర్తిగా సంపాదింపగలిగా నన్నమాట! నేరుగా వారందరితోనూ కలిసి పోవడమనేది నా హృదయంలోనేగాదు, నా రక్తంలోనే ఉందన్నమాట.

రైతుల ఆందోళనకి నాయకత్వం

1927 - 30 ల మధ్య మూడు సంవత్సరాలలోనూ రీ సెటిల్మెంట్ అన్న ప్రాతిపదికమీద ప్రభుత్వంవారు భూమి శిస్తు విధానపు త్రాళ్ళను బిగించడం తథ్యంగా కనిపించింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో, ఆ కృష్ణా గోదావరీ మండలాలలో అటువంటి పని జరిగే సూచన కనిపించింది. అప్పట్లో పి. జి. హోల్‌డ్స్‌వర్త్ (P. G. Holdsworth) స్పెషల్ సెటిలుమెంట్ ఆఫీసరుగా ఉండేవాడు. దర్మిలా 1939 లో నేను, కాంగ్రెసు పాలనలో, రెవెన్యూ మంత్రిగా వ్యవహరించినప్పుడు, ఈ హోల్‌డ్స్‌వర్త్ నా క్రింద కార్యదర్శిగా పనిచేశాడు.

కాంగ్రెస్సూ, నాబోటి కార్యోత్సాహులం ప్రజాక్షేమానికి సంబంధించిన వివిధ కార్యాలలో నిమగ్నుల మయ్యాం. కాంగ్రెసు కార్యక్రమానికీ, మా పనికీ అంత సంబంధం లేకపోయినా, ప్రజా క్షేమానికి సంబంధించిన ఎన్నో కార్యాలు మేం చేపట్టవలసి వచ్చింది. రీసెటిల్మెంటు పేరున భూమి శిస్తు పెంచితే రైతులు ఇబ్బందుల పాలవుతారు కనుక, ప్రజలకు రక్షణ ఇవ్వడం కాంగ్రెసువారి కర్తవ్యంగా భావించి, రాష్ట్రీయ కాంగ్రెసు అధ్యక్షుడుగా నేను ఈ విషయంలో పూనుకోవలసి వచ్చింది.

మదరాసు శాసన సభవారు అప్పటి ద్వంద్వ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, ఒక మంత్రిగారి ఆధిపత్యాన, ఈ విషయాలు పరిశీలించడానికిగాను, ఒక ఉప సంఘాన్ని ఏర్పరచారు. అప్పుడు అధికారంలో ఉన్న జస్టిస్ పార్టీవారికీ, కాంగ్రెసు వారికీ ఎప్పుడూ చుక్కెదురేగా! అందుచేత, వారి విచారణ సంఘంతోపాటు, మా రాష్ట్రీయ