పుట:Naajeevitayatrat021599mbp.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి ఘనతను గురించి, వారి దేశాభిమానం గురించి నాకున్న అభిప్రాయం సరి అయిందేనని, నేను కాంగ్రెసును వ్యతిరేకించి, తిరిగీ కౌన్సిల్ ప్రవేశంచేసి, వారి పార్టీలో జేరిన కొద్ది దినాలలోనే, వారి అభిమానాన్ని సంపాదించి, ప్రత్యక్షంగా వారి సంగతి సందర్భాలు గ్రహించి, నిర్ధారణ చేసుకున్నాను. 1930 సత్యాగ్రహ ప్రారంభ దినాలలో కేంద్ర శాసన సభనుంచి మాలవ్యా ప్రభృతులచేత ఇప్పించగలిగిన రాజీనామా విషయం చాలించి, విఠల్‌భాయ్‌గారి రాజీనామా సంగతి ప్రస్తావిస్తాను.

విఠల్‌భాయ్‌గారి రాజీనామా

నిజంగా విఠల్‌భాయ్ చాలా బలిష్ఠమయిన కాంగ్రెసు నాయకుడు. ఆయన ఎటువంటి త్యాగాన్ని చెయ్యడానికయినా ఎప్పుడూ సిద్ధమే. ఆయన చాలా స్వతంత్రంగా ఆలోచించగల దిట్ట. వాగ్దాటి, చాతుర్యమూ కలవాడు. మహాత్మా గాంధీగారితో సంప్రతింపు లప్పుడు వారి శక్తి సువ్యక్తం అయింది. ఆయన తాను నమ్మిన విషయాన్ని నిస్సంకోచంగా గాంధీగారికి వ్యక్తంచేసే సందర్భంలో ఆయనకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడా అనిపించేదేగాని, వారికి అడుగడుక్కీ అడ్డం తగిలి తర్క వితర్కాలు చేసే బాపతుగా ఎప్పుడూ కనిపించలేదు.

విఠల్‌భాయీ, నేనూ కాంగ్రెసు సంరంభం ఆరంభం అయిన నాటినుంచీ ఒకరికి ఒకరం బాగా సన్నిహితుల మవుతూ వచ్చాము. అధ్యక్ష పదవిని వదిలి కాంగ్రెసు సంరంభంలో చేరమని సూచిస్తూ ఆయనతో వాదప్రతివాదాలకు దిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే: "ప్రకాశంగారూ! మీరు రోజూ నాకేదో ప్రబోదం చేస్తున్నారు. ఇటువంటి విషయాలలో నాకు ఒకరి ప్రబోదం అవసరమా? నా శరీర స్థితి మీకు తెలియదు. ఇంతవరకూ నా శరీర పరిస్థితిని మీకు చెప్పవలసిన అవసరం కలుగలేదు. రోజూ ఎనీమా చేసుకుంటేనేగాని నాకు విరోచనం కాదు. ఈ విషయంలో మీరేమంటారు?"

ఈ విషయం నిజంగా నాకు విస్మయం కలిగించింది. ఆయనతో కలిసి బొంబాయిలో ఆయన 'బంద్రా' హౌస్‌లో చాలా రోజులపాటు