పుట:Naajeevitayatrat021599mbp.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము అసంతృప్తి చెందడానికి, చికాకు పడడానికీ కారణం ఉండేది కాదు. మా కపజయం కలుగుతుందేమోనన్న భీతే ఉండేదికాదు. మేము శాసన సభా ప్రవేశంచేసిన కొద్ది దినాలలోనే, బ్రిటిష్‌వారికే గాక, బాహ్య ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలన్నిటికీ మాది పకడ్‌బంద్‌గా ఏర్పడిన, మాంచి క్రమశిక్షణగల పక్షమని విశదమయింది.

ఇటువంటి మంచి పేరు సంపాదించుకోడానికి కారణం, మే మంతా కాంగ్రెసు అధినేతలలో అధిపతి అయిన వారి మాటప్రకారం ఒక్క త్రాటిమీద నడవడమే. మాకు శాసన సభలలో ప్రవేశింపమని అనుమతి - కాదు, ఆజ్ఞ యివ్వగానే ఆ సభాప్రవేశం చేశాం. ప్రపంచంలో ఏ ఇతర దేశాలలోనూ, పకడ్‌బంద్‌లోను, క్రమశిక్షణలోనూ మాతో పోటీ పడగల పార్టీ లేకపోయింది. ఇది నిజంగా గర్వింపదగిన విషయమే గదా?

దిగజారిపోయిన సందర్భాలు

ఇంత పకడ్‌బంద్‌గా వ్యవహరించ గలిగినా, మేము దిగజారిపోయి, నీరు గారిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మోతీలాలు నెహ్రూగారు ఎంత మేధావి అయినా, ఎంత బలవంతుడయినా, సాధారణంగా నాయకులూ, గురువులూ అనుకోకుండా చూపించే విధంగా, కొంత మంది వ్యక్తుల మీద ఆయనకు అభిమానం జాస్తీగా ఉండేది. సామాన్యంగా అటువంటి దుర్బలత్వాన్ని మనం పట్టించుకోకూడదు. కాని, ఆ అభిమానాలు ప్రజాక్షేమానికీ, ప్రజోపయోకర కార్యాలకీ ప్రతిబంధకాలుగా పరిణమించి నప్పుడు మాత్రం విపరీత ఫలితాల నిస్తాయి.

ఉదాహరణకి, ఆర్. ఎన్. షణ్ముగం చెట్టిగారి సంగతే విచారిద్దాం (ఆయన దర్మిలా సర్ బిరుదాంకితు డయ్యాడు). ఆయన భారత ప్రభుత్వ అవసరాలనూ, కావలసిన ఇతర వస్తు సముదాయాన్నీ అమెరికానుంచి కొని, సప్లయిచేసే విభాగానికి పెద్దగా ఉండేవాడు. కాగా, ఆయన మోతీలాల్‌నెహ్రూగారికి సన్నిహితుడుగానూ, వారి అభిమానానికీ, విశ్వాసానికీ పాత్రుడుగానూ ఉండేవాడు; మా పార్టీకి చీఫ్ విహ్‌ప్.