పుట:Naajeevitayatrat021599mbp.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభలోని కాంగ్రెసుపార్టీలో అంతర్గతంగా ఒక చిన్న 'స్వతంత్రపార్టీ'ని సృష్టించాడు.

ఆ పార్టీలో నన్నూ సభ్యత్వం స్వీకరించమని ఆహ్వానించాడు. శ్రీనివాసయ్యంగారి కోరిక నేను అంతగా పట్టించుకోలేదు. "స్వాతంత్ర్యం అంటే మీ అభిప్రాయం ఏమిటి? అవసరమయిన ఏర్పాట్లుచేసి, మీరు స్వాతంత్ర్యం కోసం యుద్ధంచేసి, దానిని సాధించడానికి సన్నిద్దులవుతున్నారా?" అని అడిగాను. ఆయన తన "స్వాతంత్ర్యం" అన్న పదం జాతీయత అన్న పదానికి సన్నిహితమనీ (Independence was National), దానిని ఆదర్శంగా పెట్టుకొని వ్యవహరిస్తామనీ అన్నాడు. వారు కోరే "స్వాతంత్ర్యం"లో కొత్తదనం ఏమీలేదనీ, పశుపక్ష్యాదులు కూడా స్వతంత్రంగా హాయిగా ఏ నిర్భంధమూ లేనివిధంగా బ్రతకాలని వాంఛిస్తాయనీ, అటువంటప్పుడు మానవుడు స్వతంత్రంగా బ్రతకాలని వాంఛిచడంలో తప్పులేదనీ చెప్పి, నేను మాత్రం మీ పార్టీ సభ్యత్వాన్ని వాంఛించడం లేదన్నాను.

పార్టీలో ఇంకో చిన్నపార్టీ ఉత్పన్నమయిందని విని, మోతీలాల్‌నెహ్రూగారు బాధపడ్డారు. పార్టీ నాయకునిగా శ్రీనివాసయ్యంగారినీ, వారి 'స్వాతంత్ర్యాన్నీ' పట్టించుకోకుండా ఉండవలసిందే. కాని అ పార్టీలో ఉన్నది ఒక్క శ్రీనివాసయ్యంగారు మాత్రమే కాదుగా! ఆయన తన కుమారుడు జవహర్‌లాల్‌తో కలిసి, మా ఉభయుల వాంఛితార్థమూ ఒకటే నంటున్నాడు. శ్రీనివాసయ్యంగారు ఒక్కడే అయివుంటే, తాను నిరంకుశంగా వ్యవహరించి ఆయన్ని త్రోసి రాజనేవాడే. కాని అందులో తన కొడుకు జవహర్‌లాల్ ఇరుక్కున్నాడు.

ఈ ప్రకారంగా, ఆ ఇరువురి మధ్యా ఆరంభం అయిన ఆ విభేదం, ఆ మూడు సంవత్సరాల సభా కార్యక్రమంలో మిళితమై, నిత్యమూ ఏదో ఉపద్రవానికీ, కోపతాపాలకీ కారణ భూతం అవుతూ వచ్చింది. సుభాష్ చంద్రబోసూ, జవహర్‌లాల్‌నెహ్రూ 'ఎవరు నాయకులుగా ఉండాలి?' అని తమలో తాము కీచులాడుకున్నా, ఉభయులూ స్వాతంత్ర్య ప్రియులే. ఇరువురూ అతివాద నాయకులే.