పుట:Naajeevitayatrat021599mbp.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరికి మాత్రం అలజడి ఆరంభం అయింది. ఆయన లిండ్సే మాటలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండి ఉండవలసింది. ప్రెసిడెంటుగారే రంగయ్యరు ఉపన్యాసాన్ని అదుపులో పెట్టనప్పుడు, లిండ్సేగారి మార్కులకు ప్రెసిడెంటుగారు అభ్యంతరం తెలపనప్పుడు తన ఉపన్యాసాన్ని తాను చెప్పదలచిన పాయింట్లు ఆధారంగా, కొనసాగించుకుపోయి ఉండవలసింది. ముఖ్యంగా తనకూ, రంగయ్యరుకూ మధ్య ఉన్న ఆజన్మ వైరాన్ని తలుచుకుని అయినా తన ధోరణి మార్చుకోవలసింది. కాని ఆయన రంగయ్యరులాంటి ప్రత్యర్థిని క్షమించి వదిలేరకం కాదుగా! తాను కాంగ్రెసుపార్టీ నాయకుడననీ, పార్టీ మెంబర్ల హక్కులను కాపాడవలసిన బాధ్యత తనమీద ఉన్నదనయినా గ్రహించకుండా, లిండ్సే రిమార్కులకు జవాబు చెప్పే అవకాశాన్ని పురస్కరించుకుని, రంగయ్యర్ని అ సభామధ్యంలో అపహాస్యం చేయడానికి పూనుకున్నాడు.

"అయ్యా, ఆంగ్లో ఇండియన్ పార్టీ నాయకు లయిన లిండ్సేగారు సి. ఎస్. రంగయ్యరుగారి దీర్ఘ ఉపన్యాసాన్ని గురించి ఫిర్యాదు చేశారు. నిజమే, అయినా, అసలు రంగయ్యరుగారి ఉపన్యాసంలో 'సరుకు' యేమయినా ఉందా?" అంటూ ఆరంభించిన అ ఉపన్యాసాన్ని విని, మా ప్రత్యర్థులయిన శాసన సభ్యు లంతా పకపకలతోటీ, ఇకిలింతలతోటీ బాగా ఆనందించారు. తనకి జూనియర్ అయిన ఒక వ్యక్తిని పార్టీనాయకుడి హోదాలో ప్రత్యర్థులనుంచి కాపాడడం పోయి, పార్టీలీడర్‌గారే అదోలా మాటలాడితే అవతలి వారికి లోకువ కాదూ?

నా అభ్యంతర తీర్మానం

వెంటనే నేను మా పార్టీ సెక్రటరీ అయిన రంగస్వామయ్యంగారికి ఒక చీటీ పంపించాను. ఆయన లీడర్‌గారి పక్కనే కూర్చున్నాడు. అ చీటిలో లీడర్‌గా నెహ్రూగారు చేసిన పొరపాటును ఆయన దృష్టికి తీసుకువచ్చి, ఆయన ఉపన్యాసం ముగించే లోపల, చేసిన పొరపాటు దిద్దుకొనుట కవసరమయిన నాలుగు మాటలు చెప్పవలసిందని కోరాను. రంగస్వామయ్యంగారికున్న భయం కారణంగా ఈ చీటి