Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను మిడిల్ స్కూలు పరీక్ష పాసవడంతోనే నా దగ్గిర బంధువులు అంతా నన్ను ఏదైనా నౌఖరీలో ప్రవేశించమని చాలా బాధపెట్టారు. వాళ్ళు అందరూ "ఎంతకాలం మీ అమ్మగారు నీకోసం ఇల్లా పాటుపడా"లని అంటూ ఉండే వాళ్ళు. ఆ రోజుల్లో మిడిల్ స్కూలు పరీక్ష మొదటి తరగతిలో పాసవడమంటే మెట్రిక్యులేషన్ పాసవడంతో సమానమే. అందుచేతనే నాకు వాళ్ళు అల్లాంటి సలహా ఇచ్చారు. నా దృష్టి మాత్రం యిదివరలో చెప్పినట్లు పై చదువుమీదా, తరవాత, ప్లీడరీమీదా వుండేది. మా అమ్మగారు కూడా మరి రెండు సంవత్సరాలపాటు చదివితేనే మంచిదని నిశ్చయించింది. అందుచేత నేను చదవడానికే నిశ్చయించాను. ఈ చదువుకు నెలజీతం ఒక సమస్య! ఈ సమస్య పరిష్కారం చేసి నా జీవితం అభివృద్ధిలోకి తీసుకువచ్చినది హనుమంతరావునాయుడు గారే.

ఆయన మిషన్ స్కూల్లో ఉపాధ్యాయులని వ్రాసే వున్నాను. ఆ రోజుల్లో ఆ మిషన్ స్కూలుకి మాన్లీ అనే ఆయన ప్రధానోపాధ్యాయుడుగా వుండేవాడు. ఆయన అర్హులయిన బీదవిద్యార్థులకి వేతనాలిప్పించి అనేకమంది కృతజ్ఞతకి పాత్రులయ్యారు. నాటకాల పరిచయంలో నాయందు కలిగిన అవ్యాజ కరుణ వల్ల హనుమంతరావునాయుడుగారు నన్ను ఆయన దగ్గిరికి తీసుకువెళ్ళి సిఫారసు చేశారు. దానికి ఆయన అంగీకరించారు.

దాంతో నా కష్టం గట్టెక్కింది. మిడిల్ స్కూల్లో చదివే కాలంలో కూడా హనుమంతరావు నాయుడుగారు రాత్రిళ్ళు నాకు ఇంటి దగ్గర ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవారు. ఆనాటి విద్యావిధానంలో మిడిల్ స్కూలుకే చాలా లెఖ్ఖలు వుండేవి. హనుమంతరావునాయుడు గారి బోధనలో ఉండే విశేషం యేమిటంటే ఆయన ఒక్కసారి పాఠంలో సూత్రం చెబితే అది తలకెక్కి దానినిబట్టి అల్లాంటి కొత్త సూత్రాలు అవగాహన చేసుకునే శక్తి కలుగుతూ వుండేది.

మాన్లీ దొరగారి స్కూల్లో హనుమంతరావు నాయుడుగారి శిక్షణకింద ఐదవతరగతి చదివాను. ఐదవతరగతి అంటే మెట్రిక్యు