పుట:Naajeevitayatrat021599mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లేషన్ కింద క్లాసు. ఈ రోజుల్లో వెనకటి అల్లరి చాలావరకు తగ్గింది. చదువుకి సంబంధించని పని అల్లా, ఒక నాటకాల గొడవే.

ఇంతలో వేసవికాలపు సెలవులు వచ్చాయి. అప్పటి హనుమంతరావు నాయుడుగారి కుటుంబస్థితి కొంచెం వ్రాస్తాను. అప్పటికి ఆయన బంధువులు అంతా రాజమహేంద్రవరంలో మంచి పదవుల్లో వున్నారు. ఆయన ఒక్కరూ మాత్రం యిక్కడ వున్నారు. 30 రూపాయల జీతంతో కుటుంబం గడవడమే కష్టము. అందులోనూ నాయుడుగారు డబ్బు లక్ష్యం లేకుండా ఖర్చుపెట్టే మనిషి. ఆయనకి అప్పటికి నలుగురు పిల్లలు వుండేవారు. ఇంకా ముసలితల్లి ఒక ఆవిడ వుండేది. ఆయన యింత సంసారమూ ఈదుతూ పైగా నాబోటి శిష్యుల భారం కూడా వహిస్తూ వుండేవారంటే, ఆదాయం చాలక అప్పుల్లో పడడంలో ఆశ్చర్యమేముంది.

ఆయన భార్య లక్ష్మమ్మగారు మహా ఇల్లాలు. ఆమె పచ్చని తాళిబొట్టు తప్ప మెళ్ళో యెప్పుడూ వేరే ఆభరణాలు యేవీ ధరించి యెరగదు. నాయుడుగారికి అప్పుల బాధ మితిమీరిన సమయంలో ఆమె వేసవికి రాజహేంద్రవరం పోయి తన బంధువుల్ని అందరినీ చూడాలని కోరింది. కొంత తర్జనభర్జన అయ్యాక నాయుడుగారు కూడా దానికి అంగీకరించారు. కాలవలు కట్టివేసిన రోజులవడం వల్ల నాటు బళ్ళమీద ప్రయాణం చెయ్యవలసివచ్చింది. వాళ్ళు అల్లా ప్రయాణానికి సంకల్పించుకున్నప్పుడు నాయుడుగారితో నాకు వుండుకున్న చనువును బట్టి చిరకాలంగా నా మనస్సులో వున్న కోరిక వెలిబుచ్చి, "నేనుకూడా రాజమహేంద్రవరం వస్తా" నని చెప్పాను. "మీ వాళ్ళు నాతో పంపడానికి అంగీకరించరు. నేను మళ్ళీ సెలవలు అయ్యాక వస్తానులే!" అని నాయుడుగారు అన్నారు.

నేను ఇంట్లో యీ సంగతి చెప్పినప్పుడు మావాళ్ళు నన్ను వెళ్ళవద్దని వారించారు. "అంతదూరం ఆయనతో వెళ్లడం యెందు"కని అన్నారు. కాని, నాకు రాజమహేంద్రవరం చూడాలని వున్నదనీ, వెళ్ళక తప్పదనీ పట్టుబట్టాను. మొండుపట్టు పట్టడం మనకి అలవాటే