పుట:Naajeevitayatrat021599mbp.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షన్" ఇండియాకు రాగలదనే నాన్పుడు మాటలతో భారతీయులను సంతుష్టి పరచాలని ఆంగ్లేయులు ఒక పన్నాగం పన్నారు. మౌంట్ ఫర్డు సంస్కరణలను నిరాకరించి త్రోసివేసిన కాంగ్రెసువారు, రాజకీయంగా ముందడుగు వేయడానికి సన్నాహాలు చేయజొచ్చారు. బ్రిటిషువారికి కాంగ్రెసువారి సూచనలు ఎప్పుడూ ఏకోశాన కూడా నచ్చలేదు. స్వరాజ్య పార్టీ నాయకులు సూచించిన ద్వంద్వ ప్రభుత్వ విధాన ప్రతిపాదనలనయినా పరిశీలించాలనే వివేకం కూడా వారికున్నట్లు కనిపించలేదు. ఈ పరిస్థితులను గ్రహించి కాంగ్రెసువారు 1926లో గౌహతీ కాంగ్రెసులో పదవీ స్వీకారం చేయరాదనీ, మదరాసు కాంగ్రెసులో సైమన్ కమిషనును బహిష్కరించాలనీ నిశ్చయించుకోవలసివచ్చింది. 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బహిష్కరణ ఉద్యమం తర్వాత 1928-29 లలో సైమన్ కమిషన్ బహిష్కరణ అన్నదే బ్రహ్మాండమయిన ఉద్యమంగా రూపొందింది. మదరాసు కాంగ్రెసు, సైమన్ కమిషన్ భారత దేశంలో అడుగుపెట్టింది మొదలు బ్రహ్మాండమయిన బహిష్కరణ ఉద్యమం సాగించాలని ఆదేశం ఇచ్చింది. వారు భారత దేశంలో అడుగుపెట్టిన నాడు దేశవ్యాప్తంగా హర్తాలు జరపాలనీ, వారు ఏ రాష్ట్రంలో, ఏ ప్రదేశానికి వెళ్ళినా వారిని బహిష్కరించవలసిందే అని కాంగ్రెసు మహాసభ నిశ్చయించింది.

అద్భుతమైన ఆరంభ విజయం

మద్రాసు శాసన సభా కాంగ్రెసు పక్షం ఏర్పడిన అనంతరం, అనగా ఫిబ్రవరిలో, నేనూ శ్రీనివాసయ్యంగారు కలిసి డిల్లీకి వెళ్ళాము. విఠల్‌బాయ్ పటేల్ అధ్యక్షతను ఆరంభం అయిన కేంద్ర శాసన సభ సమావేశం తొలి ఘట్టాలలోనే ఏర్పడిన ఉద్రేక పూరిత వాతావరణం భారతీయ దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. సమావేశం నడచిన విధానం, సభ్యులు కనబరచిన నేర్పరితనం, కాంగ్రెసు పార్టీలో కుదిరిన ఏకత్వం ప్రజాహృదయంలో బాగా నాటుకు పోయాయి.

బెంగాల్ నివాసి సత్యేంద్ర చంద్ర మిత్రాగారిని, ఆయన జైలులో ఉండగానే, కేంద్ర శాసన సభా సభ్యునిగా ఎన్నుకున్నారు. మిత్రాగారు