పుట:Naajeevitayatrat021599mbp.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వకాలతు రద్దుచేయాలనే ఊహ జనించింది. కాంగ్రెసు వేదికమీద ఈ నాభా విషయం చర్చకువచ్చి ఉంటె అది ఒక చికాకు పంచాంగంగా తయారయ్యేది. కాని ఈ విషయాన్ని కాంగ్రెసు వేదికపై చర్చనీయాంశంగా ప్రవేశపెట్ట కూడదని పట్టుపట్టిన గాంధీగారివల్ల, ఇది కాంగ్రెసులో చర్చకు రాలేదు.

ఆఖరి రోజులలో నాభా మహారాజు, తనకు ఎవరివల్లనైనా ఉపకారం జరుగుతుందేమోనన్న భ్రమతో, తోచిన వారి నందరినీ సలహా అడిగేవాడు. శాసన సభలో ఈ విషయంలో నేను కొన్ని ప్రశ్నలు వేశాను. తర్వాత యీ కేసుకు సంబంధించిన పత్రాల నన్నింటినీ తిరిగేశాను. మహారాజు చిన్నతనంలో చాలా స్వతంత్రంగా వ్యవహరించి, బ్రిటిషు వారితో తగాయిదాలు కొని తెచ్చుకున్నట్లున్నూ, ఆ స్వతంత్ర వర్తనమే ఈ తగాయిదాలకు మూలమనిన్నీ నాకు దృడ విశ్వాసం కలిగింది. వీరి ప్రత్యర్థి వీరికంటె శక్తి, పలుకుబడీ కలిగిన ఇంకొక మహారాజు.

నేను శాసన సభలో ఈ ప్రస్తావన తీసుకువచ్చి చర్చసాగిస్తూన్న రోజులలోనే, మద్రాసుకు రావలసి వచ్చింది. అప్పుడు నాభా మహారాజు కొడైకానలు కొండలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మహారాజును నేను స్వయంగా కలుసుకుని సమాచారం అంతా గ్రహించాను. ముఖ్యంగా నేను కేంద్ర శాసన సభలో పృచ్చచేసిన అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాను. ఆయన వాదన సరి అయినదీ, న్యాయమయినదీ అయినప్పటికీ ప్రభుత్వంవారు తమ పట్టు విడువలేదు.

మహారాజావారి వైపు న్యాయం ఉన్నా, ఆయన వ్యాజ్యం వేయడానికి ఇష్టపడలేదు. పక్కమార్గాల గుండా ఒత్తిడులు తీసుకువస్తే చాలని తలచాడు. మంచి హోదా, పలుకుబడీగల పెద్దలను కలుసుకుని, వారి ద్వారా ప్రభుత్వం వారికి నచ్చచెప్పించి నట్లయితే తనకు ఉపకారం జరుగుతుందని గట్టిగా నమ్మాడు. నిజానికి పలుకుబడీ, శక్తీ తమకున్నదనుకునే వారంతా రాజావారి చుట్టూ చేరారు. ఆ పెద్దల ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఆయన నమ్మిన వారెవరూ లేశమాత్ర