పుట:Naajeevitayatrat021599mbp.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబంవారు పట్టించుకోలేదు. వారు వ్యాకులత చెందనమాట సత్యమే అయినా, ఆ వోటమి తమ కుటుంబ గౌరవాన్ని మట్టుపెట్టడానికి ఉద్దేశింప బడిందని మాత్రం విశ్వసించలేదు. కాగా తమ హోదా చెడిందనీ నమ్మలేదు.

ఆరుమాసాల అనంతరం వచ్చిన పురపాలక సంఘపు ఎన్నికలలో కూడా అదేరీతిని 'పీరు' కుటుంబీకులు నిర్ణయించిన అభ్యర్థికి పోటీగా కాంగ్రెసువారు ఇంకొకర్ని నిలబెట్టడమూ, 'పీరు' అభ్యర్థి ఓడిపోవడమూ జరిగేసరికి, 'పీరు' కుటుంబీకులకు అది తలవంపనే అభిప్రాయం బాగా నాటుకుంది. కాంగ్రెస్సును కూలద్రోయాలని వాంఛించే అధికార వర్గంవారు కూడా ఇదే మంచి అదను అని తలచి, ఆ 'పీరు' కుటుంబపు పెద్దలను కలసి, హిందూ మహమ్మదీయ మైత్రి అన్నది ఒక బురఖా అనీ, ఆ బురఖా క్రింద కాంగ్రెసువారు తమ పరువు తీస్తున్నారనీ, మహమ్మదీయులను శక్తిహీనుల్ని చేస్తున్నారనీ, నిజానికి కాంగ్రెసువారికి హిందూ మహమ్మదీయ మైత్రిపై విశ్వాసం లేదనీ బోదించారు.

ఈ ప్రకారంగా ఆ మహానగరంలో హిందూ మహమ్మదీయ కలహాలు తల ఎత్తడమూ, ఐకమత్య ప్రయత్నాలు అడుగంటడమూ సంభవించాయి. రంజాం ఊరేగింపు మీద రాళ్ళు రువ్వబడ్డాయన్న ఫిర్యాదులోని నిజానిజాలు ఎల్లా ఉన్నా, ఈ ముల్తాన్ కొట్లాటలు లోకలు బోర్డు మ్యునిసిపల్ ఎన్నికలలో తలయెత్తా యన్నది మాత్రం నిర్వివాదాంశం.

నిజంగా రాళ్ళు రువ్వడమే ఖాయం అయితే, ఆ గలాటా ఆప్రాంతంలోనే అంతమయ్యేదిగాని, ఒకేసారిగా వూరులోని అన్నిమూలలా అంటుకునేదికాదు. హిందువులను అవమానించడానికీ, ఆలయాలు కొల్లగొట్టి, విగ్రహాలు ధ్వంసం చేయడానికి వివిధప్రాంతాలలో ఏకకాలమందే చేరిన గుంపులూ, ఆ పనికోసం సేకరించి జాగ్రత్త చేసిన గునపాలూ, పలుగులూ వగైరాలు ఊరేగింపుమీద రాళ్ళు పడడం అన్నది వట్టిదని రుజువు చేస్తున్నాయి. ఈ కొట్లాటలు జరిగిన