పుట:Naajeevitayatrat021599mbp.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలయం సరిహద్దులలోనే మసీదు నిర్మాణం కాకతాళీయంగా జరిగింది. ఆలయపు అర్చనలూ, మసీదు ప్రార్థనలూ ఎన్ని సంవత్సరాలనుంచో అవిచ్చిన్నంగా సాగుతున్నాయన్న విషయమై ద్వంద్వాభిప్రాయం లేదు. హిందూ మహమ్మదీయ సామరస్యం సవ్యంగానూ, ఆదర్శవంతంగానూ ఉండేదన్న విషయానికి ఇంతకన్నా ప్రబలమయిన సాక్ష్యం ఏముంటుంది?

ఎన్నికలు తెచ్చిన ముప్పు

ఈ సంగతి తెలుసుకున్నాక ఈ అల్లరులకు అసలు కారణాలు ఏమయి ఉంటాయా అని సుదీర్ఘంగా విచారణలు జరిపాం. సేకరించిన సమాచారంవల్ల పురపాలక సంఘపు ఎన్నికల కోలాహలమే ఈ తగాయిదాలకు మూలకారణమని తేలింది. అంతకు ఆరుమాసాలక్రితం జిల్లాబోర్డు ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడి పురపాలక సంఘం చాలా పురాతన మయింది. అనేక సంవత్సరాలుగా అక్కడి "పీరు" కుటుంబంవారు పురపాలక సభ్యులపేర్లు సూచించడమూ, ప్రజలు వారినే ఎన్నుకోవడమూ ఆచారంగా ఉండేది. ఈ ఆచారానికి విరుద్ధంగా ముల్తాన్ కాంగ్రెసువారు "పీరు" అభ్యర్థికి ప్రత్యర్థిగా ఇంకొకరిని నిలబెట్టారు. అల్లా నిలబెట్టిన కాంగ్రెసు అభ్యర్థికి జయం చేకూరింది.

అంతకుముందు బోర్డు వైస్‌ప్రెసిడెంటు ఎన్నిక విషయంలోనూ అలాగే జరిగింది. ఆ రోజులలో సహకార నిరాకరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతోంది. అప్పటికి ఇంకా గాంధీగార్ని నిర్బంధంలోకి తీసుకోలేదు. వీలు చిక్కితే దానిని అణగద్రొక్కుదామని కాంగ్రెసు వ్యతిరేకులు తలచేవారు.

వారు ఈ సంఘటనను సాకుగా తీసుకుని పీరు కుటుంబంవారికి పురెక్కించారు. గాంధీగారి హిందూ మహమ్మదీయ మైత్రి అన్న ప్రబోధం బూటకపు ప్రచారమనీ, అది మహమ్మదీయులను ఓడించి అణగద్రొక్కడానికే పుట్టినదనీ నమ్మబలికారు. అదే మొట్టమొదటి సంఘటన అవడంచేత కాంగ్రెసు వ్యతిరేకులు ఎంతగా బోధించినా పీరు