పుట:Naajeevitayatrat021599mbp.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాగించుకొనడానికి మంత్రులకు వాటికి సంబంధించిన ప్రభుత్వోద్యోగులపై అధికారం ఉండాలి.

సబర్మతీలో అంగీకారం పొందిన విధానాలకు ఈ విషయం అనుగుణంగా లేదంటూ జయకర్‌గారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితులలోనే నేను కాన్పూరు తీర్మానాలకన్నా సబర్మతీ నిర్ణయాలు హీనంగా ఉన్నాయని అనవలసి వచ్చింది.

1926 మే 5 వ తేదీన అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో ఈ తేడా పాడాల వల్లనే స్వరాజ్యపార్టీ లోని రెండు ముఖ్య విభాగాల వారికీ పొత్తు కుదరలేదనీ మోతిలాల్ నెహ్రూగారే బహిరంగపరిచారు. ఈ పరిస్థితులలో మద్రాసువారు సబర్మతీ నిర్ణయాలకు వ్యతిరేకు లయ్యారు. అప్పుడు మోతిలాల్‌గారు అనిబిసెంట్‌గారి కామన్‌వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ఆమోదంకోసం అఖిల భారత కాంగ్రెసు సంఘం వారి ముందు ప్రతిపాదించారు. దానికి మేము వ్యతిరేకించాము.

1925 లో చిత్తరంజందాస్‌గారు ఫరీద్‌పూరులో స్వరాజ్యపార్టీ పేరుమీద కొన్ని షరతులు ప్రతిపాదించి, వాటిని ప్రభుత్వం వారు అంగీకరించాలని హుంకరించే ఉన్నారు. పైగా తన ప్రతిపాదనలు అంగీకారం కాకపోతే ప్రభుత్వంవారికి తాము ఇస్తూన్న సహకారం ఆపివేయబడుతుం దన్నారు. ఆంగ్లేయ పరిపాలకులు తమ శక్తి సామర్థ్యాలను గ్రహించి గౌరవిస్తారనే యోచనతో ఆ స్వరాజ్య పార్టీ నాయకులు ఇలాంటి ద్వంద్వ విరుద్ద ప్రతిపాదనలతో చాలా తికమకలు కలుగజేశారు. ఈ ప్రకారంగా అన్ని విధాల స్వరాజ్య పార్టీ వారు దెబ్బతిన్నారు. సహకార నిరాకరణానికి వ్యతిరిక్తత ప్రకటించినంతమాత్రానగాని, దానిని గురించి ప్రబోధం చేసినంత మాత్రానగాని ఆంగ్లేయులు లొంగిపోరన్న విషయం ఆదిలో దాస్-మోతిలాల్ నెహ్రూగార్లకు అవగాహన కాలేదు.

1924 పిబ్రవరిలో స్వరాజ్య పార్టీవారు కేంద్ర శాసన సభలో అధికారరీత్యా తమ కోరికలు వెలిబుచ్చారు. 1925 లో జరిగిన