పుట:Naajeevitayatrat021599mbp.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాన్పూరు కాంగ్రెసులో కూడా వాటిని వ్యతిరేకించారు. కాగా, వారిలో ఉన్న రెండు విభాగాల వారికీ పొత్తు కుదిరిన కారణంగా, మూడు-నాలుగు మాసాలలో తిరిగి హెచ్చరిక జేశారు.

మంత్రులు శాసనసభాసభ్యులకు పూచీదారులయితే, తాము 1924లో వ్యక్తపరచిన కోరిక ప్రభుత్వం వారికి సమ్మతమైనట్టే భావిస్తామన్నారు. తిరిగీ ఫరీదుపూర్‌లో దాస్‌గారు తమ కోర్కెలను సవ్యంగా తీర్చకపోతే సహకారం అన్నది మృగ్యం అయిపోతుందనీ బెదిరించారు. ఈ ప్రకారంగా స్వరాజ్య పార్టీవారు అనేక విధాల తబ్బిబ్బులయ్యారు.

గాంధీగారి ఆధ్వర్యవంలో ప్రారంభమైన సత్యాగ్రహోద్యమపు ఉద్రిక్త పరిస్థితులలో స్వరాజ్యవాదులు చాలా త్యాగాలు చేశారన్నది నిజమే అయినా, వీరికి, పాతకాలపు మితవాదులకూ దృఢసంకల్పం తక్కువ. దేశావసరాలను గుర్తించీ, ప్రజాక్షేమం లక్షించీ కాంగ్రెసువారు వెల్లడిస్తూ వచ్చిన కోర్కెలను మన్నించడానికి స్థిరసంకల్పంగాని ధైర్యంగాని వీరిలో లేవనే అనవలసి వస్తుంది. పాతకాలపు స్వేచ్ఛా వాదుల విషయంలోలాగే ఈ స్వరాజ్య పార్టీవారి ప్రతిపాదనలకూ, ప్రజాభిప్రాయాలకూ సంబంధం తక్కువే. వాటికి పొంతన లేదనే చెప్పాలి. కాగా, అటు ఆంగ్లేయ అధికారుల వరస చూస్తే - లార్డ్ రీడింగూ, బర్కెన్‌హెడ్డూ కూడా అఖండులు. ఈ ఆంగ్ల రాజకీయ వేత్తల కుత్సితపు వాగ్దానాలు పయోముఖ విషకుంభాలే అయినా, మనవారికి తంత్రజ్ఞత తక్కువ అవడంచేతనో యేమోగాని, లేనిపోని ఆశలు వారి హృదయాలలో రేకెత్తాయి. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్భంలో దేశీయులలో కనిపించిన ఐకమత్యానికి కలవరపడి, క్రిందు మీదయిన రీడింగ్ ప్రభువు తన జిత్తులమారితనంతో ఎత్తుపై ఎత్తులు వేస్తూ, తాను రిటైరయ్యేనాటికి కాంగ్రెసు పార్టీలో చీలికలు కల్పించి కృతకృత్యుడయ్యాడు.

ఈ ప్రకారంగా కాంగ్రెసులో బయల్దేరిన అభిప్రాయ భేధాలూ, చీలికలూ ఒక ప్రక్కనుంచీ, హిందూ మహమ్మదీయ కలహాలూ, కల్లో