పుట:Naajeevitayatrat021599mbp.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశం మట్టుకు ఎప్పుడూ గాంధీగారి పక్షంగానే ఉన్నదన్న సంగతి బెల్గాం కాంగ్రెసులో రుజువయింది. బెల్గాం కాంగ్రెసులో దాస్-మోతిలాల్ నెహ్రూగార్లని కాదని, వారి పార్టీని వోడించి, గాంధీగారి విధానాన్ని పున:ప్రతిష్టజేశారు. అయితేనేం, తాను తక్కువ మెజారిటీతో గెలవడంచేత గాంధీగారు, తమ పార్టీవారికి ఏదో భీతి ఉన్నదనే నిర్ధారణకు రాక తప్పదంటూ, కాంగ్రెసును దాస్-మోతిలాలుల పరం చేశారు.

పార్టీలో విభేదాలు

స్వరాజ్య పార్టీవారు శాసన సభా ప్రవేశంచేసి రెండు సంవత్సరాలు (1924-25) వ్యవహరించిన సందర్భంలో వారిలో వారికి అబిప్రాయబేదాలు వచ్చి, పేచీలు, కీచులాటలు, పిల్ల సమ్మేరీలు ఆరంభం అవడం మూలంగా ఆ పార్టీ తన పలుకుబడిని కోల్పోయింది. కౌన్సిల్ లోపల ఉంటూనే దానిని తిరగతోడుదాం, దాని కార్యక్రమం, రాజ్యాంగ విధానం సాగకుండా వ్యవహరిద్దాం అంటూ వచ్చినవారే క్రమేపీ నీళ్ళు కారిపోయి పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అనడంలో అర్థంలేదు.

తమ ఉద్దేశాలకు ఆదర్శాలకూ, అనుగుణంగా దేశక్షేమానికి ఉపకరించే వ్యవహారాలలో ప్రభుత్వంతో సహకరిస్తూ, అనుమానస్పదమైన విషయాలలో ప్రాతికూల్యం వహిస్తూ "ప్రతిస్పందన సహకారిత్వం" (Responsive co-operation) అనే నూతన విధానాన్ని స్వరాజ్యవాదులు చెన్నరాష్ట్రాంలోనే గాక, ఇతర రాష్ట్రాలలో కూడా చేపట్టడం జరిగింది. కాగా, కొంతమంది కాంగ్రెసు సేవకులకు ప్రభుత్వోద్యోగాలమీద మోజు కలిగింది. మొత్తానికి, ఏదో విధంగా స్వరాజ్య పార్టీవారు రాజకీయంగా దిగజారిపోయారు. లోపల ఉండి దెబ్బతీస్తాం, రాజ్యాంగ విధానాన్ని సాగనివ్వం, తిరగతోడుతాం అంటూ బీరాలు పలికిన స్వరాజ్య పార్టీవారే, వారి మధ్య ఉత్పన్నమైన భేదాభిప్రాయాలకు తట్టుకోలేక, దెబ్బతిని, పార్లమెంటరీ పద్దతికి దిగజారి, రాజ్యాంగాన్ని తామే చేపట్టి తంటాలు పడేవరకూ వచ్చారు.