Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండేది. మలయాళదేశంలో ముప్పయి సంవత్సరాల కొకసారి విప్లవ జ్వాలలు ప్రజ్వరిల్లడం పరిపాటి అయింది. ఏదెల్లా ఉన్నా మలబారు జిల్లాలో జరిగిన మొట్టమొదటి కాంగ్రెసు సమావేశం ఫలప్రదంకావడం ఆయన సహించలేక పోయాడు.

నేను ఒట్ట పాలియం జేరేసరికి, ఏదో విధంగా పోలీసువారు ఆ సమావేశం జరక్కుండా అడ్డగిస్తారనే భావం నా మనస్సులో నాటుకుంది. కాని అటువంటిదేమీ జరుగలేదు. సమావేశం ముగిసే లోపల ఏదో విధంగా శాంతిని భగ్నం చెయ్యడానికి కొందరు వ్యక్తులు నియమింపబడ్డారు. "స్వరాజ్య" పత్రికా సంపాదకీయవర్గానికి చెందిన అబ్దుల్ హమీద్‌ఖాన్ నాతోపాటు పై సమావేశంలో పాల్గొన్నాడు. హమీద్ ఖాన్ దరిమిలా చెన్నపట్టణంలో ముస్లింలీగు నాయకుడు కూడా అయ్యాడు. అ సమావేశం సాంతం అయ్యే లోపల మేము తలచినట్లుగా ఏ సంఘటనా జరక్కపోవడం మా కందరికీ ఆనందం కలిగించింది.

పోలీసువారి జులుం

కాని సాయంత్రపు సమావేశం ముగిసే లోపల కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. ఆ గ్రామంలో సంచరిస్తూ ఉన్న హిందూ-మహమ్మదీయ కాంగ్రెసు పక్షీయుల్ని కొందరు దుండగులు అల్లరి పెట్టడమూ, కొట్టడమూ జరిగింది. గ్రాడ్యుయేటూ, లా కాలేజీ లెక్చెరరు పి. గోవిందమేనోన్ అల్లుడూ, పెద్ద మనిషి అయిన శ్రీరామున్నీ మేనోన్ అనే ఆయన ఆ సమయంలో మెయిన్ రోడ్డు గుండా హమీద్‌ఖాన్‌తో కలిసి వెడుతున్నాడు. కాన్పరెన్స్ కాలంలో శాంతిని కాపాడడం కోసం అంటూ మల్లపురం నుంచి కొందరు పోలీసువారు ఒట్టపాలియంకు రావింపబడ్డారు. కొందరు పోలీసువారు రామున్నీ మేనోన్‌నీ, హమీద్‌ఖాన్‌నీ ఆపుజేసి, అడ్డదిడ్డపు అసభ్య ప్రశ్నలు వేశారు. అబ్దుల్ హమీద్‌ఖాన్ తాత్వికంగా చాలా గొప్పవాడు. రామున్నీ మేనోన్ మూర్తీభవించిన సాధుసజ్జనుడు. పోలీసువారు కొన్ని ప్రశ్నలు వేశాక రామున్నీ