మేనోన్ రెండు దవడలమీదా లెంపకాయలు వేశారు. ఎల్లాగో దెబ్బలు తినకుండా హమీద్‌ఖాన్ తప్పించుకున్నాడు. రామున్నీ మేనోన్‌ని ఉద్రేకపరచడం కష్టం. ఆయనిది, ఒక చెంపమీద కొడితే రెండో చెంప చూపించే తత్త్వం. వారుభయులూ ఉద్రేకపడని కారణంగా అది అంతటితో ఆగింది. కాన్ఫరెన్స్ ముగిసే లోపలనే వారిద్దరూ తిరిగివచ్చి జరిగిన ఉదంతం అంతా సభలో నివేదించారు. జరిగిన ఉదంతాన్ని రామున్నీ మేనోన్ చెపుతూ ఉంటే, సభలోవారికి ఉద్రేకం జనించింది.
అదే సమయంలో కొన్ని వీథులలో పోలీసులు మాప్లాలమీద చెయ్యి చేసుకున్నారు. పొలీసుల చేతులలో దెబ్బలు తిన్న మంచి బలమూ, ఒడ్డూ పొడుగూ ఉన్న ఒక మాప్లాని కొందరు మిత్రులు సమావేశంలోనికి తీసుకు వచ్చారు. ఆయన నిజంగా మంచి బలశాలి. ఆర్గురు జనం మూక వుమ్మడిగా ఒకేసారి ఆయనమీద విరుచుక పడ్డా నిగ్రహించుకోగల బలం ఆయనకుంది. పైగా ఆయన బెల్టులో కై జారుంది. అదృష్ట వశాత్తూ ఆయన ఆ కై జారుని పోలీసువారిపై ప్రయోగించలేదు. ఆ గలటాని ఆపుచేయగలిగిన కొందరు వ్యక్తులు ఆయన్ని కాన్ఫరెన్సులోనికి తీసుకువచ్చారు. ఆయన చాలా ఉద్రేకంగా ఉన్నాడు. ఒక్క ఉదుటున వెనక్కి వెళ్ళి కక్ష సాధిద్దాం అనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కాని కొందరు మిత్రులు ఆయన్ని బలవంతంగా నిరోధించారు. ఒక్క ఉదుటున బైటకుపోవాలని ఆయన తలచినప్పుడు వారంతా కలసి బలవంతంగా ఆయన్ని పడుకోబెట్టారు. కొన్ని సంవత్సరాలనుంచీ రాజ్యసభా సభ్యుడుగా ఉంటున్న సయ్యద్ మూర్తాజా సాహెబుగారు ఆనాటి సభలో మాతోపాటు ఉన్నారు. ఆయన తిరుచి నివాసి. బలవంతంగా పడుకోబెట్టబడిన అ ఆసామీ ఛాతీమీద మూర్తజా కూర్చుని శాంతి వచనాలు పలకడం ఆరంభించాడు. నాగపూరు కాంగ్రెసు ఆమోదాన్ని పొందిన అహింసా విధానం గురించి బోధచేస్తూ మొత్తానికి ఎల్లాగయితేనేం అయన్ని శాంత పరచారు.
వీరేగాక ఆనాడు అనవసరంగా పోలీసుల చేతులలో దెబ్బలు తిన్నవారు యింకా ఉన్నారు. వారూ కాన్ఫరెన్సులోనికి పరుగుపరుగున