అనుయాయులకు అదేశం
రాజీ ప్రతి పాదనల రూపేణా అతిచాకచక్యంగా నాయకుల మధ్య భేదాభిప్రాయాలు కలుగజేసి కలతలు రేపాలని రీడింగ్ ప్రభువు వేసిన ఎత్తులకూ, గాంధీగారి వాఙ్మూల రూపేణా దేశవ్యాప్తంగా మానవ హృదయాంతరాళాలలో స్థిరపడిన భావాలకూ ఎంత వత్యాసం ఉంది! అయితేనేం ఒక విధంగా రీడింగ్ ఆశయాలు సిద్ధించాయనే అనుకోవచ్చు. ప్రతి పాదింపబడిన రాజీ సూచనలుచూసి, దాస్, మోతిలాల్ గార్లు కూడా ఉల్టా సీదా అయ్యారనే అనవలసి ఉంటుంది. సెషన్స్ జడ్జీ విధించిన ఆరు సంవత్సరాల కారాగార శిక్షానుసారంగా యరవాడ జైలులో గాంధీగారిని నిర్బంధించేవరకూ నేను గాంధీగారిని అనుసరిస్తూనే ఉన్నాను.
ఆఖరు సారిగా, జైలు ముఖ ద్వారాన్నిదాటి లోపల ప్రవేశిస్తూ, వారు నా ద్వారా దేశానికి అందజేసిన సందేశంలో కోరిన దేమిటో తెలుసా? దేశవ్యాప్తంగా ఖద్దరును వృద్ధిచేయమనీ, నిర్మాణ కార్యక్రమం బాగా కొనసాగించమనీని. అంతేకాదు. ఆ ఆదేశంలో తన్ను ఎవ్వరూ అనుసరించవద్దనీ ఉంది. అనగా వారి తర్వాత ఇంకొకరెవ్వరూ జైలుకు పోకుండా నిర్మాణాత్మక కార్యక్రమంలోనే నిమగ్నులవ్వాలన్నదే వారి ఆశయం అన్నమాట. దాన్తో ఆయన్ని అనుసరించి జైలుకు పోవాలి అన్న నా కోరిక విఫలం అయింది. అంతవరకూ అనేకసార్లు నేను ఆంగ్ల రాజ్యాంగ యంత్రాంగాన్ని ధిక్కరిస్తూ వచ్చినా, ఎందుచేతనో గాని పరిపాలకుల కబంధ హస్తం నాపై ప్రయోగింపబడలేదు. కాగా గాంధీగారి పరిస్థితి ఎల్లా పరిణమిస్తుందో గమనించాలనే ఉద్దేశంతో మాలో కొంతమందిమి బైటే ఉండి పోవాలనిన్నీ నిశ్చయించుకున్నాము.
గాంధీగారిని 1922, మార్చి 13 వ తేదీనాడు నిర్బంధించారు. విచారణా, నేరారోపణా 18 వ తేదీన జరిగాయి. శిక్షకూడా వెనువెంటనే ఆనాడే విధింపబడింది.
ఆంధ్రలో ఖద్దరు ఉద్యమం
ప్రప్రథమంగా నిర్మాణ కార్యక్రమం జయప్రదంగా కొనసాగిన