పుట:Naajeevitayatrat021599mbp.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నాను. కాగా గాంధీగారిని నిర్బంధించి విచారణ నిమిత్తం అహమ్మదాబాదు సెషన్సు కోర్టులో హాజరు పరచినప్పుడు నేను స్వయంగా హాజరయి ఆ విచారణ కాండనంతా పరిశీలించాను. ఆ విచారణ అన్నది ప్రపంచ చరిత్రనే తారుమారుచేసే విధంగా జరిగింది.

ఆ కోర్టులో గాంధీగారిచ్చిన వాఙ్మూలం వినేవరకూ వారి ఘనత వారి ఆత్మీయులకు కూడా అర్థం కాలేదనే అనుకోవలసివుంది. లిఖిత పూర్వకంగా దాఖలు చేయబడిన ఆ వాఙ్మూలంలో గాంధీగారు తమ్ము నిర్బంధించినతీరూ, కేసు విచారణచేసిన విధమూ అన్నీ పేర్కొంటూ నిరసనగా తాను చెప్పదలచిన సంగతుల నన్నింటినీ అందు పొందు పరిచారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిచే దరిమిలా రచియింపబడిన "కాంగ్రెసు చరిత్ర"లో ఆ వాఙ్మూలంప్రముఖ స్థానాన్నే అక్రమించింది.

ఆ వాజ్మూలాన్ని గాంధీగారు చదువుతూ వుంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఆనాటి వాక్కులు యీనాడు కూడా నా చెవులలో మార్మ్రోగుతూనే ఉన్నాయి. ఆ వాఙ్మూల సారాంశం ఇది: "ఈ భారత దేశపు నలుమూలల్లోనూ యీ మద్య జరిగిన అల్లర్లకూ, చావులకూ, హత్యలకూ నేను స్వయంగా బాధ్యత వహిస్తున్నాను. ఈ సహకార నిరాకరణ ఉద్యమాన్నీ, శాసన ధిక్కార ప్రణాళికనూ నడుపు తున్నది నేనే. నా ఉద్యమాల కారణంగా జరిగిన, జరుగుతూన్న కర్మకాండ కంతటికి నేనే కర్తను, నేనే భర్తను. అందువల్ల నేను పూర్తిగా శిక్షార్హుణ్ణి. మరణ శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాను. మీకు యధోచితమని తోచిన శిక్షను మీరు విధించవచ్చును."

ఈ పలుకులు గాంధీగారి నోటినుంచి వెలువడుతూంటే నాతోపాటు కోర్టుహాలులో కూర్చుని ఆ కర్మకాండను తిలకిస్తూన్న యావత్తు జనానికి, స్త్రీ పురుష వివక్షత లేకుండా, కళ్ళంట నీళ్ళుకారాయి. ఆనాడు అక్కడ అల్లా కూర్చుని కన్నీరు కార్చిన జనంలో ఆంగ్లేయ స్త్రీ, పురుషులు కూడా ఉన్నారు. మానవా తీతులయిన దైవాంశ సంభూతులు తప్ప సామాన్యులెవ్వరూ అట్టి వాఙ్మూలం యివ్వలేరు.