1
కాంగ్రెసు అధిష్ఠానవర్గ సభ్యత్వం:
నిర్మాణ కార్యక్రమ ప్రచారం
అహమ్మదాబాదులో కాంగ్రెసు జరిగిన కొద్దిరోజులలోనే దేశబంధు చిత్తరంజన్ దాస్‌గారిని నిర్బంధించడమూ, ఆయనకి మూడుమాసాలు జైలుశిక్ష విధించడమూ జరిగింది. ఆ కారణంగా నేను అఖిల భారత కాంగ్రెసు సంఘానికి సర్వసాధారణ సహాయ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అప్పట్లో విఠల్‌భాయ్ పటేల్‌గారు జనరలు సెక్రటరీగా అన్ని కార్యకలాపలు చూస్తూ ఉండేవారు. సహాయకార్యదర్శిగా నన్ను నియమించడం సబబుకాదని కే.సంతానంగారు ఒక చిన్న అభ్యంతరాని వెలిబుచ్చారు. ఈ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చుతూ, విఠల్‌భాయ్ పటేల్‌గారే, సమాధానంగా, నెలకు ఏడెనిమిదివేల రూపాయలు ఆర్జించగల శక్తిమంతుడు సహాయకార్యదర్శి పదవికి పనికిరాడా అని ప్రశ్నించారు. గాంధీగారు కూడా ఆ కార్యనిర్వాహకసంఘ సభలో ఆసీనులయ్యే ఉన్నారు. సంతానంగారి అభ్యంతరాన్ని త్రోసిపుచ్చుతూ, నన్ను సహాయకార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.
అంతేకాదు. దరిమిలా, [1]దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారి నిర్బంధంతో, నేను కార్యనిర్వాహక సంఘ సభ్యుడనూ అయ్యాను. చిత్తరంజన్ దాస్‌గారి ముఖ్య స్నేహితునిగానూ, పత్రికా సంపాదకునిగానూ, కాంగ్రెసు కమిటీ సహాయ కార్యదర్శిగానూ, కార్యనిర్వాహకవర్గ సభ్యునిగానూ, భారతదేశమందలి అన్ని రాష్ట్రాలకూ తరుచు వెడుతూ ఉండేవాడిని. అవసరాన్నిబట్టి కార్యనిర్వాహక సంఘ సభలూ, అఖిలభారత కాంగ్రెసుసంఘ సభలూ, దేశంలో నలుమూలలా జరిపేవారం. ఆ కారణంగా దేశం నలుమూలలా తిరక్క తప్పేది కాదు. అంతేకాదు. ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు సంఘ అధ్యక్షునిగా
నిర్మాణకార్యక్రమం ఉత్సాహవంతంగా కొనసాగించడానికిగాను ఆంధ్రప్రాంతాలన్నీ జిల్లాలవారీగా అనేకసార్లు తిరగవలసిన అవసరమూఉండేది.
- ↑ 1922 మార్చిలో.