Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార్యనిర్వాహకవర్గ సభ్యునిగాగాని, సహాయకార్యదర్శి హోదాలోగాని, ఏ ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినా, ఆ ప్రయాణాలకు దారి ఖర్చులయినా ఇచ్చే సంప్రదాయం అప్పటి కింకా ఆచరణలోనికి రాలేదు. దేశం నలుమూలలా తిరగడానికీ, ఆంధ్ర ప్రాంతం అంతా చుట్టడానికి ధారాళంగానే ధనం వ్యయ మయ్యేది. కాంగ్రెసు ఆదేశానుసారంగానూ, గాంధీగారి ప్రోద్బలంతోనూ నేను ప్రాక్టీసు విరమించే నాటికి[1] చాలాబాగా సంపాదించి ఉన్నకారణంగా ఈ ప్రయాణాల కన్నింటికి విచ్చల విడిగా నా సొంత డబ్బే ఖర్చు పెట్టేవాడిని.

దేశీయపాఠశాలలు - చరఖాకేంద్రాలు

ఆంధ్రదేశంలో అన్నిమూలలా నా స్వంతబాధ్యతపైనా, పర్యవేక్షణక్రిందా దేశీయపాఠశాలలు నెలకొల్పాను. ముఖ్యంగా ఒంగోలులో ఆరంభింపబడిన దేశీయ విద్యాలయానికి కాంగ్రెసు నిధులనుండి కాణీకూడా తీసుకోకుండా విరివిగా నేనే ఖర్చు పెట్టాను. అదేప్రకారంగా ఒంగోలుకు ఎనిమిదిమైళ్ళ దూరంలో ఉన్న గురవారెడ్డిపాలెంలో స్థాపించబడిన చరఖా కేంద్రానికీ నేనే విరివిగా ఖర్చుపెట్టాను. ఆ కేంద్రానికి పర్యవేక్షకునిగా (ధారా) గోపాలశాస్త్రిగారిని నియమించాను. ఈ నిర్మాణ కార్యక్రమానికి పదివేలరూపాయలు అఖిల భారత చరఖా సంఘంవారు మంజూరుచేసి ఉన్నప్పటికీ, గోపాలశాస్త్రిగారిని వారు సరిగా ఎరుగని కారణంగా ఆ పత్రంమీద జామీనుదారునిగా నేనూ సంతకం చేశాను. పదివేల రూపాయలూ గోపాలశాస్త్రిగారికి ముట్టాయి, ఆ సొమ్ము సద్వినియోగంచేసి శాస్త్రిగారు అవసరమయిన చరఖాలూ, మగ్గాలూ, పత్తీ వగైరాలు కొని గురవారెడ్డిపాలెం కేంద్రాన్ని యావత్తు భారతదేశంలోనూ ఆదర్శప్రాయమైందిగా రూపొందింప జేశారు. అఖిల భారత చరఖాసంఘం వారుకూడా తమ నివేదికలో యీ విషయాన్ని గురించి ప్రస్థావనచేస్తూ భారతావనిలోకల్లా ముఖ్యమయిన కేంద్రంగా గురవారెడ్డిపాలెం కేంద్రాన్నీ, గోపాలశాస్త్రిగారి సేవనీ అభినందించారు.

ఒంగోలులో నా సొంత బంగాళాలో ప్రారంభింపబడిన దేశీయ

  1. 1921 జనవరిలో.