పుట:Naajeevitayatrat021599mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xv

ములను వివరించుచు శాసన సభలో ఆయన మూడు దినములు వరుసగ నుపన్యసించుట అది ఒక కొత్త రికార్డు. 1953 లో ప్రత్యేకాంధ్రరాష్ట్రము ఏర్పడినప్పుడు ప్రకాశము పంతులుగారే ప్రథమాంధ్ర ముఖ్యమంత్రిగ నుండవలెనని సూచించుటతో నెహ్రూజీ ప్రకాశముగారికి రాజకీయ చరిత్రలో నెందును కని విని యెరుగని సత్కారము చేసిరి. నిజమునకు ఆనాడు ప్రకాశము గారు ఏ రాజకీయ పక్షమునకు చెందిన వారు కారు. సంఖ్యాధిక్యముగల పక్షమునకు ఆయన నాయకుడు కారు. ఆయన రాజకీయ స్థాయికి, స్వాతంత్ర్యముకొరకు ఆయన చేసిన అనుపమ త్యాగమునకు కృతజ్ఞతా ప్రకటన మది. ప్రకాశము తెలుగు ప్రజల స్వతస్సిద్ద నాయకుడు. ఆయన ప్రజల మనిషి. నిత్యము ప్రజల నాడిని పట్టి చూచుచు, వారికి హితవైన కార్యములనే ఆయన చేపట్టు చుండెను.

ప్రకాశము పంతులుగారి స్వస్థలము ఒంగోలు. ఒంగోలు కేంద్రముగ ప్రత్యేకముగ ఒక జిల్లాను ఏర్పరుప వలెనని ఆయన చిరసంకల్పము. ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ఆ సంకల్పమును సఫలము చేయుటయే కాక, దివంగతుడైన ఆ మహానాయకుని యెడ కృతజ్ఞతా సంస్మృతి చిహ్నముగ దానికి "ప్రకాశము జిల్లా" యని నామకరణము చేసినది. ప్రకాశము మిగుల దూరదృష్టిగల నేత. ఆయన ప్రవేశపెట్టిన ఫిర్కా డెవలెప్మెంట్ కార్యక్రమమును ఆనాడు చాలామంది అపార్థము చేసికొనిరి. కాని, అదియే నేటి మన పంచాయతి రాజ్య ప్రణాళికకు మార్గదర్శి అయి, అందరికి కనువిప్పు కలిగించినది. జమీందారీల రద్దు ప్రణాళిక ప్రకాశ కర్తృకము. పేద ప్రజల సంక్షేమమే సదా ప్రకాశముగారి ప్రధానాశయముగ నుండెను.