పుట:Naajeevitayatrat021599mbp.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరుసటి సంవత్సరం కాంగ్రెసు మద్రాసులో జరిగింది. మళ్ళీ రస్‌విహారీఘోషే అధ్యక్షుడు. అది కేవలం మితవాద మహాసభ. వారు ప్రభుత్వంమాట అల్లా ఉండనిచ్చి, జాతీయవాదులపైన తమ తీవ్ర వాగ్ధాటి అంతా వినియోగించారు. 1908 వ సంవత్సరం మొదలు మరి ఏడు, ఎనిమిది సంవత్సరాలు - అంటే లక్నో కాంగ్రెస్‌వరకూ - కాంగ్రెస్సు కేవలం మితవాదులకి రంగస్థలమై ప్రభుత్వాన్ని యాథాలాపంగా విమర్శిస్తూ తీర్మానాలు పాసుచెయ్యడమే కాని, కోట్లకొలదిగా ఉన్న జనసామాన్యాన్ని రాజకీయంగాను, ఆర్ధికంగాను అభివృద్ధిలోకి తీసుకుని రావడానికి ఎటువంటి కార్యక్రమమూ ఇవ్వలేకపోయింది. ఇంక స్వరాజ్యకాంక్షమాట వేరే చెప్పవలసింది ఏమిఉంది? మితవాదుల దృష్టి ఎంత సేపూ ఉన్నతోద్యోగాలు, మింటో - మార్లీ సంస్కరణాల వల్ల శాసనసభ్యుల సంఖ్య కొద్దిగా వృద్ధిపొందడము, కొన్ని ప్రభుత్వ కార్యనిర్వాహక సభ్యత్వాలు దేశీయుల అందుబాటులో ఉండడము మొదలయిన సంస్కరణాలమీదే ప్రసరించింది. అందుచేత కాంగ్రెస్ ఆదర్శం వృద్ధి పొందలేదు. హిందువులైన కాంగ్రెస్ నాయకులు ఈ సంస్థద్వారా ఉద్యోగాలు సంపాదించడం చూచేసరికి ముసల్మానులకి కూడా సహజంగా వాటి విషయమై అభిలాష బయలుదేరడమూ తద్వారా హిందూ మహమ్మదీయ సమస్యకి పునాదులు పడడమూ జరిగాయి. లక్నో కాంగ్రెస్‌నాటికి మహమ్మదీయుల అంతరంగికాందోళన ఫలించి లక్నో ఒడంబడిక ప్రాప్తించింది. ఆ ఒడంబడికే నేటికి మనకి అన్ని విధాలా అనర్థదాయకం గానూ, జాతీయాభివృద్ధికి నిరోధకంగానూ, అభేద్యంగానూ ఉన్న హిందూ ముసల్మాను సమస్యకి మూలం అని నా అభిప్రాయము. అందుచేత, అప్పటినించీ కాంగ్రెస్‌కి ఎప్పుడైనా కులాసాగా వెడుతూ ఉండేవాణ్ణి. అంతకంటె ఎక్కువగా కాంగ్రెస్ ఎప్పుడూ నన్ను ఆకర్షించలేకపోయింది. ఆ తరవాత సర్ విలియం వెడ్డర్‌బర్ను అధ్యక్షత కింద అలహాబాదులో జరిగిన కాంగ్రెస్‌కి హాజరు అయ్యాను. మద్రాసులో జరుగుతూ వచ్చిన కాంగ్రెస్సులకి హాజరైన విషయ వ్రాయనే అక్కరలేదు.