పుట:Naajeevitayatrat021599mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలాంటి స్థితిలో ఆయన నాతో పనిచేయడానికి ఇష్టంలేక కేసులోనించి తప్పుకున్నారు. నేనే కేసు ఆర్గ్యుమెంటు చెప్పి మొట్టమొదటగా బారిష్టర్లమీద ఉంటూండే దురభిప్రాయం పోగొట్టగలిగాను.

ఆ తరవాత నాకు చిరకాలమిత్రు లయిన ఆర్. కుప్పుస్వామయ్యరుగారికి ఒక కేసులో నాతో పనిచేయవలసిన అవసరం కలిగింది. ఆయన సర్ వేపా రామేశం గారిలాగే బి. యల్. లో ఫస్టు క్లాసులో, ఫస్టుగా పాసయ్యారు. పాపం ఆయన శేషగిరి అయ్యరుగారిలాగ తప్పుకోలేదు. తప్పుకోమని శేషగిరి అయ్యరుగారు ఇచ్చిన సలహా కూడా గణించలేదు.

ప్రాక్టీసుకి వచ్చిన ప్రారంభంలో ఇంకొకసారి సర్ సుబ్రహ్మణ్యయ్యరుగారి కోర్టులో ఆర్గ్యుమెంటు చెపుతూ ఉన్నాను. ఆ సమయంలో ఆయన కోర్టులో కూర్చుని ఉన్న ఆర్. వెంకట్రామశాస్త్రిగారిని పిలిచి దానికి సంబంధించిన కేసు ఏదో ఉండాలి తియ్యమన్నారు. వకీలు పనిచేసే వాళ్ళకి అది అంత గౌరవకరం అయిన విషయం కాదు. దాని మీద నేను వెంటనే లేచి, "అయ్యా! నేను, నా మిత్రులూ ఇందుకు సంబంధించిన కేసులన్నీ వెతికాము. ఎక్కడా ఈ తీర్పుకి వ్యతిరేకంగా కనిపించ లేదు," అని గట్టిగా చెప్పాను. దాంతో ఆయన శాంతించారు. మొత్తంమీద మొదట్లో మద్రాసు బారు నా కంతగా స్వాగతం ఇవ్వలేదు; సరిగదా, నాకు కాలూనడానికే కొంత కష్టం కలిగించిందని చెప్పాలి. పెద్దల్లో భాష్యం అయ్యంగారు, కృష్ణస్వామయ్యరు, సుందరయ్యరు ప్రభృతులూ, పిన్నల్లో అప్పటికే మంచి చురుకుగా వస్తూన్న శ్రీనివాసయ్యంగారు, అల్లాడి, యన్. వరదాచారి, టి. ఆర్. వెంకట్రామశాస్త్రి, వి. వి. శ్రీనివాసయ్యంగార్లూ మంచి గడ్డుగా ఉండేవారు. కాని, మొదటినించీ నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే సహాయం అయింది.

ఏ వృత్తిలోనైనా ఆత్మవిశ్వాసం అవసరం. అందులో లాయరు వృత్తికి అది మరీ అవసరం. జడ్జీలని ఆశ్రయించి, వారి దయవల్ల వృద్ధిలోకి రావడం అనేది ఎక్కడోగాని ఉండదు. అక్కడక్కడ ఉన్నా అది సిద్ధాంతం కాదు. ఆత్మవిశ్వాసమూ, దానికితోడు పరిశ్రమా ఉండాలి.