పుట:Naajeevitayatrat021599mbp.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను కేసులు వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా చదివేవాణ్ణి, దాంతోబాటు లా కూడా క్షుణ్ణంగా చదివేవాణ్ణి. లండన్‌లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్దపెద్ద బారిష్టర్లు, జడ్జీలు రాత్రి ఒకటి, రెండు గంటలదాకా చదువుతూ కృషి చెయ్యడం చూశాను. అల్లాగే నేనుకూడా చాలా కృషి చేసేవాణ్ణి. ఆత్మ విశ్వాసమూ, నిర్బయత్వమూ, పరిశ్రమా విడవకుండా ఈ మూడింటి సమన్వయం వల్లా నేను మద్రాసుబారులో నా స్థానాన్ని ఆక్రమించుకో గలిగానని చెప్పాలి. ఇంతే కాకుండా నా క్లయింట్లకి నే నంటే పరిపూర్ణ మైన విశ్వాసం కూడా ఉండేది. వాళ్ళకేసులు నా దగ్గిర ఉంటే, వాటితో ఐక్యం అయి పట్టుదలతో పనిచేస్తా ననే ప్రఖ్యాతికూడా గడించుకున్నాను. ఆ విశ్వాసమే నాకు ఆ వృత్తిలో జయం చేకూర్చింది. ఈ సందర్బంలో జడ్జీలతో ప్రవర్తించేటప్పుడు లాయర్లకి ఉండే ధైర్యం కూడా గొప్పగా సహాయం చేస్తుంది. జడ్జీలని ఎదురుకునే సాహసం చూపించే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. దానివల్ల అల్లాంటి సందర్భంలో అవసర మైన వాళ్ళు తమ కేసులు పట్టుకుని వెతుక్కుంటూ వస్తారు. రాజమహేంద్రవరంలో మునసబు రంగమన్నారుతో వ్యవహరించి నప్పుడు కూడా నా అనుభవం ఇదే. నాకు జడ్జీలతో వచ్చిన పట్టింపుల్ని గురించి ముందు వేరుగా వ్రాస్తాను.

మొత్తంమీద నేను కొద్దికాలంలోనే మద్రాసు హైకోర్టులో అప్పెలెటుసైడునా, సివిల్‌లోనూ, క్రిమినల్‌లోనూ మంచి ప్రాక్టీసు గడించేసరికి నన్ను ఏ జిల్లాలకి అయినా వెళ్ళి ప్రాక్టీసు పెట్టమని సలహా ఇచ్చిన సర్ జాన్ వాలెస్సూ, చీప్ జస్టిస్ అర్నాల్డు వైటూ మొదలైన వారు కొంచెం ఆశ్చర్యపడ్డారు. మద్రాసులో కొంతకాలం ప్రాక్టీసుచేసి పిమ్మట హైకోర్టు జడ్జీ అయిన నేపియర్ ఒకసారి నాతో, "హిందూ లాని గురించి పుస్తకం వ్రాసిన జాన్ డి. మెయిన్ తరవాత మద్రాసు బారిష్టరులలో ఇంత సివిల్ ప్రాక్టీసు సంపాదించిన వాళ్ళు ఎవ్వళ్ళూ లేరు!" అన్నాడు. మొత్తానికి విశేషం శ్రమలేకుండానే నాకు పుష్కలంగా కేసులు లభించేవి. నేను ఎప్పుడూ కేసులకోసం బాధపడలేదు.

అప్పుడే నాకు రాజమహేంద్రవరంలో స్నేహితుడైన కోకా