పుట:Naajeevitayatrat021599mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పడం. ఆయన తెలిసే చెప్పారో, లేక ఆశ్రిత పక్షపాతంచేతనే చెప్పారో నిర్ణయించడం కష్టం. దానికితోడు స్థానికంగా లక్ష్మీనరసింహంగారిమీద వుండే కక్షలు కూడా కలిశాయి.

విచారణ సబ్‌కలెక్టరు ఎదట. లక్ష్మీనరసింహంగారి తరపున నేను హాజరయ్యాను. ముద్దాయి స్థానికంగా చాలా ప్రముఖులనీ, ఇక్కడ ఈ కేసు జరగకూడదనీ, మరి ఒక జిల్లాకి ట్రాన్సుఫరు చెయ్యమనీ పిటీషను పెట్టాను. ఆ పిటీషను కొట్టివేశారు. అందుమీద ట్రాన్సుఫరుకోసం హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో డాక్టరు స్వామినాథన్ గారిని ప్లీడరుగా ఏర్పాటుచేశాను. స్వామినాథన్‌గారు బారిష్టరు పాసయి కొద్దికాలం కిందటే ప్రాక్టీసు పెట్టారు. కేసు హైకోర్టులో డేవిస్ బెంచి దగ్గిరికి వచ్చింది.

ఆ డేవిస్ లావుగా వుండేవాడు. చాలా భీకరంగా మాట్లాడుతూ వుండేవాడు. కేసు చూస్తూనే "No points to argueː case dismissed" అన్నాడు. స్వామినాథన్‌గారు నోరు విప్పనైనా విప్పలేదు. నాకు చాలా చిరాకు కలిగింది. కోర్టులోనే స్వామినాథన్‌గారిమీద పడి, "ఇదేమి బారిష్టరీ అండీ! కేసు ఆర్గ్యుమెంటు చెప్పకుండానే డిస్మిస్ చేస్తే, మాట్లాడక ఊరుకున్నారు!" అని కేకలు వేశాను. ఆయన "ప్రకాశంగారూ! రాత్రి మా యింటికి భోజనానికి రండి! మీతో మాట్లాడాలి," అన్నారు.

రాత్రి భోజనానికి వెళ్ళాను. డాక్టరు స్వామినాథన్‌గారు బ్రాహ్మణులే కాని, అప్పటికే ఒక బట్లరుచేత వండించుకుని తింటూ వుండేవారు. ఆయన చాలా జాగ్రత్త మనిషి. బహు క్లుప్తంగా ఖర్చుపెట్టుకుంటూ డబ్బు కూడబెట్టేవారు. ఆయన నన్నెంతో ఆప్యాయంగా ఆదరించి, "ప్రకాశంగారు! మీలో మంచి చురుకుతనమూ, ధైర్యమూ కనిపిస్తున్నాయి. మీరుఎందుకు బారిష్టరు కాకూడదు?" అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది! "నేను సెకండు గ్రేడు ప్లీడర్‌ని. బీదవాణ్ణి. నాకేమిటి! వేలకువేలు ఖర్చయే బారిష్టరీ ఏమిటి? నాకు అది ఎల్లాగ లభ్య