పుట:Naajeevitayatrat021599mbp.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రీతిగా జరుగుతూనే వుంది. మొదటిసంవత్సరం పరిపాలనా నివేదికలో పరిపాలన సంతృప్తికరంగానే వున్నదని గవర్నమెంటు వ్రాసింది. ఈ హత్యకేసు సందర్భంలో పోలీసుల హడావిడి చూసి నాతో భాగస్థుడుగా ఉండిన పిళ్ళారిసెట్టి నారాయణరావు భయపడిపోయాడు. తరవాత, అతన్ని మా పార్టీ తరపున మునిసిపల్ కౌన్సిలరుగా కూడా చేశాము. చివరికి అతనికి కూడా ధైర్యం చెప్పవలసివచ్చేది.

ప్రతి కక్షుల ప్రయత్నాలు ఇంతటితో ఆగలేదు. నా పార్టీలో నాకు బలంగా వుండే ఏలూరి లక్ష్మీనరసింహంగారిమీద మళ్ళీ ఒక కేసు బయలుదేరదీశారు. ఆ రోజుల్లో రాగి బంగారం చేస్తామనే మంత్రగాళ్ళు, వాళ్ళ మాయల్లో పడే అమాయికులూ వుంటూండేవాళ్ళు. శనివారపు పేట ఎస్టేటులోకి ఇల్లాంటి మంత్రగాడొకడు సిద్ధమై, రాగి బంగారం చెయ్యడానికి పూనుకున్నాడు. ఒక గదిలో దేవతని పెట్టి, ఇంట్లో వుండే బంగారమూ, జవాహరీ అంతా ఆ దేవతకి అలంకరించి పూజచెయ్యాలని చెప్పి బంగారం అంతా సేకరించాడు. నాలుగురోజులు జపం అయ్యాక ఆ బంగారం అంతా మూటకట్టుకుని, రాత్రికి రాత్రి ప్రయాణమై మాయమైపోయాడు. ఆ బంగారంలో కొన్ని వస్తువులు ఏలూరి లక్ష్మీనరసింహంగారి ఇంటికి దగ్గరగా ఉన్న, ఆయన స్నేహితుడైన ఒక మహమ్మదీయుడి దగ్గిరికి చేరాయి. అతను పెద్ద గడ్డంతో భయంకరంగా వుండేవాడు. ఆ మహమ్మదీయుడు బజారులో ఆ జవాహరీ అమ్ముతూ వుండగా షరాబులు కొనడానికి కొంచెం సంకోచించారు. వెంటనే పోలీసులు వచ్చి ఆ మహమ్మదీయుణ్ణి పట్టుకున్నారు.

అందుమీద ఏలూరి లక్ష్మీనరసింహంగారు ఆ జవాహరీ ఆ సాహేబుదే నని మేజస్ట్రీటుదగ్గిర స్టేటుమెంటు ఇచ్చారు. పోలీసులు ఆ స్టేటుమెంటు విశ్వసించకుండా ఆ అమ్మకం ఆపుజేశారు. ఈ లోగా పోలీసులు ఆ జవాహరీని గురించి ప్రకటన చెయ్యగా శనివారపుపేటవారు వచ్చి ఆజవాహరీ పోల్చుకున్నారు. వెంటనే పోలీసులు ఏలూరి లక్ష్మీనరసింహంగారిమీద, సాహేబుమీద కేసుపెట్టారు. ఏలూరి లక్ష్మీనరసింహంగారి నేరం అంతా ఆయన "జవాహరీ సాహెబుదే" అని