పుట:Naa Kalam - Naa Galam.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తున్నా" రని చెబుతూ, మేడం గాంధి మీ పేరు ప్రకటిస్తే, అంతా మిమ్మల్నే అంగీకరిస్తారని నేను సరీన్‌తో చెప్పాననగానే, శ్రీ జలగం సంతోషంతో నన్ను అభినందించారు !

హోమ్‌మంత్రిగా ఉన్నప్పుడు శ్రీ జలగం కార్యదక్షత గురించి తెలుసుకున్న ప్రధాని ఇందిరా గాంధి 1973 డిశంబర్‌లో ఆయన పేరునే ప్రకటించారు. 1973 డిశంబర్‌ 10న శ్రీ జలగం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను సరీన్‌తో నడిపిన రాయబారానికి నన్ను అభినందిస్తూ శ్రీ జలగం నాకు లేఖ రాశారు. అంతేకాక, ఈ విషయంలో నా పాత్రను అభినందిస్తూ శ్రీ సరీన్‌ కూడా ఢిల్లీ వెళ్లిన తరువాత నాకు లేఖ రాశారు. ఆ లేఖను నేను శ్రీ వెంగళరావుకు చూపించగా, ఆయన దాన్ని తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. దక్షులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులలో ఒకరుగా శ్రీ వెంగళరావు పేరు తెచ్చుకున్నారు. ఆయన 1973 డిశంబర్‌ నుంచి 1978 మార్చి వరకు ముఖ్యమంత్రిత్వంలో ఉండి, రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషిచేశారు. రాష్ట్ర చరిత్రలో తనకొక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు.

నెహ్రు - గాంధి కుటుంబంతో నా అనుబంధం

దురదృష్టవశాత్తు, శ్రీ రాజీవ్‌ గాంధి 1991 మే 21వ తేదీ అర్థ రాత్రి తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో అనూహ్యంగా, ఘోరంగా హత్యకు గురైనారు. శ్రీలంకలోని తమిళులపై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న హింసాకాండకు అవరోధంగా ఉంటుందన్న ఉద్దేశంతో "లిబరేషన్‌ టైగర్స్‌ తమిళ్‌ ఈలం" అధినేత వేలుపిళ్లె ప్రభాకరన్‌ అభ్యర్ధనపై ప్రధాని రాజీవ్‌ గాంధి అక్కడికి భారతీయ శాంతి పరిరక్షక దళాన్ని పంపారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు, తరువాత కొన్ని కారణాల వల్ల భారతీయ శాంతి సైనికుల వునికి ప్రభాకరన్‌కు నచ్చలేదు.