పుట:Naa Kalam - Naa Galam.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్ను సాదరంగా సాగనంపారు. శ్రీ సరీన్‌ నన్ను 75 నిమిషాల సేపు ప్రశ్నించారు.

వెంగళరావు ఆదుర్దా

మరో విశేషాన్ని ఇక్కడ పేర్కొనవలసివుంది. శ్రీ సరీన్‌ను కలుసు కొనడానికి వెడుతూ మార్గం మధ్యలో శ్రీ పిడతల రంగారెడ్డి ఇంటిలో తేనీరు తీసుకోడానికి ఆగాము. శ్రీ రంగారెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గాను, ఆర్థిక, సమాచార శాఖల మంత్రిగాను పనిచేశారు.

మేము వెళ్లేసరికే శ్రీ రంగారెడ్డి గృహంలోపల అంతకు పూర్వం రద్దయిన పి.వి.నరసింహారావు మంత్రి వర్గంలోని సగం మందికి పైగా సభ్యులున్నారు. వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి శ్రీ బి.వి. సుబ్బారెడ్డి, మంత్రులు శ్రీ మూర్తిరాజు, శ్రీ జలగం వెంగళరావు ప్రభృతులున్నారు. వారికి శ్రీ పిడతల రంగారెడ్డి నన్ను పరిచయం చేస్తూ, "కాబోయే ముఖ్యమంత్రిని గురించి తుర్లపాటి రాసిన లేఖను మరింత వివరణ కోసం మేడం గాంధి గవర్నర్‌ సలహాదారు సరీన్‌కు పంపారట ! సరీన్‌ ఆహ్వానం పై తుర్లపాటి రాజ్‌ భవన్‌కు వెడుతూ ఇక్కడికి వచ్చా"రని పేర్కొన్నారు.

వెంటనే ముఖ్యమంత్రిత్వం కోసం ప్రయత్నిస్తున్న శ్రీ జలగం వెంగళ రావు నన్ను పక్కకు పిలిచి, "శ్రీ సరీన్‌ మీతో ఏమంటాడో నాకు వెంటనే తెలియజేయండి" అని అన్నారు. నేను అలాగేనన్నాను.

సరీన్‌తో సమావేశమైన మరునాడు శ్రీ వెంగళరావు నివాసానికి వెళ్లి జరిగినదంతా చెప్పి "మీకు శాసన సభ్యుల మద్దతు లేదని వారు భావిస్తున్నారు. ఎమ్‌.ఎల్‌.ఎ ల మద్దతును మీరు కూడగట్టుకుంటే, మీ అభ్యర్ధిత్వానికి వాళ్లు