పుట:Naa Kalam - Naa Galam.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోప్పడ్డారు!" అని శ్రీ చిరంజీవి నవ్వుతూ అన్నారు!

అంతకు పూర్వం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.టి. రామారావు తన స్వగ్రామమైన నిమ్మకూరులో ఒక సభలో ప్రసంగిస్తూ "మహాత్మాగాంధి జయంతి అయిన అక్టోబర్‌ 4వ తేదీన" అని అన్నారు. "అక్టోబర్‌ 4 కాదు, 2వ తేదీ" అని సభలోని విద్యార్ధులు సవరించారు! "ప్రమాదోధీమతామపి" అన్నట్టు, పొరపాటు ఎవరికైనా తప్పదు. ఎవ్వరూ సర్వజ్ఞులు కారు, కాలేరు కూడా. అయితే, రాజకీయ రంగంలో వున్న వారు, ప్రజల మధ్యకు వచ్చే వారు కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకొని వుండడం అవసరం. లేకపోతే, నలుగురిలో నగుబాటుకు గురికావలసి వస్తుంది కదా!

"ఆంధ్రకేసరి"జన్మదినోత్సవం : గ్రామ స్వరాజ్య దినోత్సవం

"ఆంధ్రకేసరి" శ్రీ టంగుటూరి ప్రకాశం ఆంధ్రదేశంలో గ్రామ పంచాయతీ రాజ్యాన్ని నెలకొల్పడానికి ఎనలేని కృషి చేశారు. ఒక విధంగా మహాత్మాగాంధి లక్ష్యమైన "రామరాజ్యా"నికి ఇది మరో పేరు అని చెప్పవచ్చు. గ్రామీణ సౌభాగ్యం పెంపుదలకు, పల్లెసీమలు పాడి పంటలతో కళకళలాడ్డానికి ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, ఆయన కృషి మధ్యదళారీలకు, మిల్లర్లకు, పెట్టుబడిదార్లకు కన్నెర్ర అయింది. ఆయనను అందరూ కలిసి కట్టుగా 1946లో మద్రాసు ముఖ్యమంత్రిత్వం నుంచి తొలగించారు! అంతే కాదు 1953లో ఆయన తిరిగి ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి అయినప్పుడు మద్య నిషేధాన్ని తొలగించడానికి ఒప్పకోనందున, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి, ఒక్క వోటు తేడాతో ఆయనను ముఖ్యమంత్రిత్వం నుంచి తప్పించారు!

గ్రామ స్వరాజ్యం కోసం ఎంతగానో కృషి చేసిన ఆ మహనీయుని జన్మదినమైన ఆగస్టు 23వ తేదీనాడు "గ్రామ స్వరాజ్య దినోత్సవం"గా రాష్ట్ర మంతటా పాటించాలని 1981లో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ టి. అంజయ్యకు