పుట:Naa Kalam - Naa Galam.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రి వర్గంలో మంత్రులైన మామా అల్లుళ్లు శ్రీ యుతులు కొండా వెంకటరంగారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారలు 'విశాలాంధ్ర' నిర్మాణానికి వ్యతిరేకులు. అలాగే "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అనే పేరుతో పుస్తకం రాసి, ఆ ఉద్యమానికి ఊపు, ఉత్సాహం కల్పించిన "మార్క్సిస్టు గాంధి" శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యపై కూడా అప్పటిలో తెలంగాణా ప్రాంతంలో దౌర్జన్యం జరిగింది.

ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని పేర్కొనాలి. 'విశాలాంధ్ర' నిర్మాణానికి అప్పటి ప్రధాని పండిట్‌ నెహ్రూ, కేంద్ర విద్యామంత్రి, జాతీయ ముస్లిం మహానాయకుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వ్యతిరేకులు. కారణం మరేమీ లేదు. మూడు భాషా ప్రాంతాల (తెలుగు, మరాఠి, కన్నడం) సమ్మేళనమైన హైదరాబాద్‌ ఉర్దూ భాషా ప్రాచుర్యంతో "దక్కన్‌ సంస్కృతి"కి నిలయం. ఆ "దక్కన్‌ సంస్కృతి"ని విచ్ఛిన్నం చేయరాదని నెహ్రూ, ఆజాద్‌ల పట్టుదల. అప్పటిలో హైదరాబాద్‌ రాష్ట్రం విభజనకు ఆనాటి ముస్లిం ప్రముఖులు కొందరు ప్రతికూలం. వారికి సహజంగానే మౌలానా ఆజాద్‌ వత్తాసు. ఆయన ఉర్దూభాషలో మహాపండితుడు. నెహ్రూకు కుడిభుజం. ఇక చెప్పేదేమున్నది? వారిద్దరి వ్యతిరేకత "విశాలాంధ్ర" నిర్మాణానికి అవరోధం.

ఆ పరిస్థితులలో నేను ఎడిటర్‌గా వున్న "ప్రజా సేవ"లో "తెలుగువాడా!" అన్న శీర్షికతో తీవ్రపదజాలంతో "విశాలాంధ్ర" నిర్మాణానికి అవరోధాలు కల్పిస్తున్న వారిని విమర్శిస్తూ సంపాదకీయం రాశాను. దానిలో నెహ్రూ - ఆజాద్‌ల ప్రతికూలతను కూడా ఖండించాను. ఆ ప్రతి కూలతను ప్రతిఘటించడానికి తెలుగు వారందరు ఏకత్రాటిపై నడవాలని "విశాలాంధ్ర" ఉద్యమాన్ని మహోధృతం చేయాలని రాశాను. దానిపై నాకు ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ జారీ చేయనున్నట్టు నాకు