పుట:Naa Kalam - Naa Galam.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్టిపూర్తి ఉత్సవంలో ప్రస్తావించి, నన్ను అభినందించారు. అప్పటికి నా వయస్సు 23 సంవత్సరాలు!

విశాఖ పెద్దలు శ్రీ తెన్నేటి జీవిత చరిత్ర గ్రంథాన్ని వ్రాయించి ప్రచురించాలని నిర్ణయించినప్పుడు ఆ గ్రంథ రచన బాధ్యతను నాకే అప్పగించారు. ఆ కమిటికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆ సమయంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం వైస్‌- ఛాన్సలర్‌ అయిన శ్రీ ఆవుల సాంబశివరావు చైర్మన్‌. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, ఆ తరువాత ఉపరాష్ట్రపతి అయిన శ్రీ కృష్ణకాంత్‌ విశాఖపట్నంలో జరిగిన సభలో ఆ గ్రంథావిష్కరణ చేశారు.

నాపై అరెస్టు వారెంట్‌!

1956లో నేను "ప్రజా సేవ" పత్రిక ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం కాలేదు. "విశాలాంధ్ర" (ఆంధ్రప్రదేశ్‌) ఏర్పాటు చేయాలని తీవ్రమైన ఆందోళనోద్యమం సాగుతున్నది. "విశాలాంధ్ర" నిర్మించాలంటే, హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించాలి. హైదరాబాద్‌ రాష్ట్రం తెలంగాణా (తొమ్మిది జిల్లాలు) మరాఠ్వాడ (మరాఠి మాట్లాడే అయిదు జిల్లాలు), కన్నడం మాట్లాడే రెండు జిల్లాల కలగాపులగం. అప్పటి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు. ఆయన కూడా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల ఏకీకరణతో "విశాలాంధ్ర"కు అనుకూలుడు.

"విశాలాంధ్ర" నిర్మాణ ఉద్యమానికి అనుకూలంగా తెలంగాణా ప్రాంతంలో ప్రచారం చేయడానికి వెళ్లిన ప్రముఖ ఆంధ్రనాయకుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంపై అక్కడి ప్రత్యేక తెలంగాణావాదులు దౌర్జన్యం జరిపి, చొక్కా చింపి వేశారు. ఆ సంఘటనలో వారు పాల్గొనలేదుకాని, అప్పటి హైదరాబాద్‌