పుట:Naa Kalam - Naa Galam.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


"ఆంధ్రకేసరి" ప్రకాశం గారికి ఆయన అత్యంత సన్నిహిత సహచరుడు. ప్రకాశం గారు రోమన్‌ హీరో జూలియస్‌ సీజర్‌ అయితే, తెన్నేటిని మార్క్‌ ఆంటోనితో పోల్చవచ్చు. అలాంటి ఆయన షష్టిపూర్తి మహోత్సవాన్ని ఆయన అభిమానులు విశాఖపట్నంలో జరపదలచినప్పుడు అక్కడి పాత్రికేయులు అందుకు సంబంధించిన వార్తలకు తగినంత ప్రచారమివ్వడంలేదని ఆ షష్టిపూర్తిని తలపెట్టిన పెద్దలు భావించారు. ఎంత గొప్పవాడైనా, తన స్వగృహంలోను, తన స్వస్థలంలోను ఆయన గొప్పతనాన్ని అంతగా గుర్తించరు. అందు వల్లనే "ఏ గతి రచియించితేని సమకాలము వారలు మెచ్చరేకదా!" అంటూ చేమకూర వెంకట కవి వాపోయాడు. బహుశా ఆ గొప్పవాడి గోత్రాలు, బలహీనతలు, లోపాలు స్థానికులకు బాగా తెలిసి వుండం ఇందుకు ఒక కారణం కావచ్చు. అయితే, తెన్నేటి వారి చరిత్ర "తెరిచిన పుస్తకం". స్వచ్ఛమైన ధవళ వస్త్రం వంటిది. రాజకీయరంగంలో ఎన్నో ఉత్తమ సంప్రదాయాలకు ఆంధ్రలో ఆయన ఆద్యులు, ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికై, మరో పార్టీలో చేరిన వారు వెంటనే తమ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి ఇండి పెండెంట్‌గానో, కొత్త పార్టీ టిక్కెట్టు పైనో పోటీ చేసి గెలవాలన్న సంప్రదాయాన్ని 1951లో తాను కాంగ్రెస్‌ నుంచి రాజీనామా చేసినప్పుడు నెలకొల్పారు.

అలాంటి మహనీయుని షష్టిపూర్తి మహోత్సవానికి తగినంత ప్రచారం అక్కడి పాత్రికేయు లివ్వడంలేదని, విశాఖపట్నానికి ఎక్కడో సుదూరాన గన్నవరంలో వుంటున్న నన్ను షష్టిపూర్తి కమిటికి ఒక ప్రధానకార్యదర్శిగా నియమించి, ప్రచార బాధ్యతను నాకు అప్పగించారు. నాకు అప్పగించిన బాధ్యతకు తగినంత న్యాయంచేశాననే నేను భావించాను. శ్రీ తెన్నేటి, ఆయన విశిష్ట రాజకీయ, పార్లమెంటరీ జీవితాన్ని గురించి వివిధ దిన, వార, పత్రికలలో వార్తలు, వ్యాసాలు ప్రచురింపజేశాను. ఈ విషయాన్ని శ్రీ తెన్నేటి కూడా తన