పుట:Naa Kalam - Naa Galam.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభకు ముఖ్య అతిధిగా వచ్చే డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి ద్వారా శ్రీ నాగేశ్వరరావుకు ప్రదానం చేయాలని నిర్ణయించారు.

విజయవాడ గాంధీజీ మునిసిపల్‌ హైస్కూలులో బ్రహ్మాండమైన సన్మాన సభ. డాక్టర్ గోపాలరెడ్డి, ఆంధ్ర ఆంధ్రేతర చలనచిత్రరంగాల ప్రముఖులు, వేలాది ప్రజలు పాల్గొన్నారు. తీరా అక్కినేనికి బిరుదు ప్రదాన సన్మానపత్రాన్ని నేను చదివే సమయానికి సభను చెల్లా చెదురు చేసే గాలివాన! షామియానాలు కూలిపోకముందే అందరం తలొక చోటకు తలదాచుకోడానికి చెదిరిపోయాము. అందరితోపాటు నాకు తీవ్రమైన ఆశాభంగం! అలాంటి "దబాటువానలు" ఎక్కువ సేపు వుండవు. అందులోను అది ఆగస్టు నెల. శ్రావణ మాసం. వర్షాలకేమి లోటు! ఇప్పటివలె అప్పట్లో వర్షాలకోసం వరుణ పూజలు, యజ్ఞయాగాదులు చేయవలసిన అవసరం వుండేది కాదు. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలలో ఇట్టే వర్షంపడి, అట్టే తెరపియిచ్చేది. ఒక్క రోజులోనే వచ్చే వాన, వెలిసేవాన! ఎన్ని సార్లో!

మరి, అక్కినేని సన్మానసభను అర్ధంతరంగా ముగించవలసి వచ్చింది కదా! ఆ రోజు రాత్రి ఆంధ్ర ఫిలిం చాంబర్‌ వారు శ్రీ అక్కినేని గౌరవార్ధం గాంధినగర్‌లోని ఎస్‌.కె.పి.వి.వి. హిందూ హైస్కూల్‌ హాలులో విందు ఏర్పాటు చేశారు. ఆ విందు సభలోనే సన్మాన పత్రాన్ని నేనే చదివి, శ్రీ గోపాలరెడ్డి ద్వారా శ్రీ నాగేశ్వరరావుకు సమర్పించాలని ఆహ్వాన సంఘం వారు నిర్ణయించారు.

అందరూ భోజనం చేస్తున్నారు. తీరా నేను సన్మానపత్రం చదవడం ప్రారంభించేసరికి కరెంట్‌ పోయింది! అయినా, నేను బెంబేలు పడలేదు. సన్మానపత్రం రాసింది నేనే కాబట్టి, చీకట్లో అయినా దానిలో ఏమున్నదో చూడకుండానే చెప్పగలను. అందువల్ల, "చేతికి, నోటికి మధ్య అడ్డం లేదంటారు.