పుట:Naa Kalam - Naa Galam.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యథావిధిగా సన్మానం జరిపించారు. పాత్రికేయులు, తదితరులు హాజరైనారు.

గవర్నర్‌ శ్రీ తివారి ప్రసంగిస్తూ "శ్రీ తుర్లపాటి ఉన్నత వ్యక్తిత్వం, దేశభక్తి, జాతీయ దృక్పథం గల ఉత్తమ జర్నలిస్టుగా ప్రఖ్యాతి గడించారు. అతి చిన్నవయస్సులో 14 ఏళ్ల ప్రాయంలోనే జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రథమ ముఖ్యమంత్రి "ఆంధ్ర కేసరి" టంగుటూరి ప్రకాశంగారి వద్ద కార్యదర్శిగా పనిచేయడంతోపాటు ఆయన వద్ద ఎన్నో విషయాలు, మెలకువలు తెలుసుకుని, ఆయన లక్షణాలను పుణికి పుచ్చుకుని ముందుకు సాగారు. తరువాత అనేక పత్రికలలో పనిచేసి ఎడిటర్‌ స్థాయికి ఎదిగి, ఉత్తమ జర్నలిస్టుగా, "సభా కేసరి"గా అనేక అవార్డులు, ప్రశంసలు పొందారు. అంతేకాక "పద్మశ్రీ" అవార్డు అందుకున్న తొలి తెలుగు జర్నలిస్టుగా ప్రసిద్ధి చెందా"రని గవర్నర్‌ వక్కాణించారు.

"శ్రీ తుర్లపాటి భారత దేశానికి గర్వకారకుడైన జర్నలిస్టు" అని గవర్నర్‌ అభినందించారు. శ్రీనీలం దయానందరాజు వందన సమర్పణ చేశారు. ఈ సన్మానసభ జరిపించడంలో శ్రీ దయానందరాజు పడిన శ్రమను నేను ఎన్నటికీ మరచిపోలేను.

కొడుకు - కోడలు :

ఇక్కడ నా కుమారుడు జవహర్లాల్‌, కోడలు లక్ష్మిశ్రీ లను గురించి ప్రస్తావించ వలసివుంది. జవహర్‌ కొందరు కుమారులవలె కాదు. పెద్దలపట్ల గౌరవం, చిన్నవారి పట్ల ప్రేమ అతడిని బంధుమిత్రులందరికీ ప్రేమ పాత్రుని చేశాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల అతడికి ఎనలేని భక్తి గౌరవాలు. తన 16వ యేటనే మాతృమూర్తి కృష్ణకుమారిని కోల్పోయినందున, ఒంటరిగా మిగిలిన నన్ను కంటికి రెప్పవలె చూచుకుంటూ వచ్చాడు.