పుట:Naa Kalam - Naa Galam.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీసుబ్రహ్మణ్య భారతి (తమిళనాడు), ప్రొఫెసర్‌ జె.బి.ఎస్‌. హాల్డేన్‌ (బ్రిటన్‌) ప్రభృతులు తెలుగు భాషా మాధుర్యం, విస్తరణ సౌలభ్యం, శబ్ద పరిపుష్టి గురించి చేసిన ప్రశంసలను పేర్కొన్నాను.

అన్నింటినిమించి, భారతదేశానికి అధికార భాష కాదగిన భాష తెలుగు మాత్రమేనని ప్రఖ్యాత బ్రిటిష్‌ జీవశాస్త్రవేత్త, భాషావేత్త అయిన ప్రొఫెసర్‌ హాల్డెన్‌ 1950 ప్రాంతాలలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించాను. భారత దేశంలో హిందీ తరువాత హెచ్చు మంది మాట్లాడేది తెలుగేనని పేర్కొంటూ ఆయా రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వారి సంఖ్యలను కూడా యిచ్చాను. ఈ సమస్యపై నేను పత్రికలలో రాసిన వ్యాసాన్ని చిన్నపుస్తక రూపంలో తీసుకువచ్చాను. ఆ పుస్తకాన్ని దేశంలోని ప్రముఖ తెలుగు వారందరికీ పంపించాను. అప్పటి తమిళనాడు గవర్నర్‌ శ్రీ పి.ఎస్‌. రామమోహన రావు, బి.జె.పి మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎమ్‌. వెంకయ్య నాయుడు ప్రభృతులు నా కృషిని అభినందిస్తూ లేఖలు రాశారు.

నా వ్యాసాలను చూచిన అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ పరుచూరి గోపాల కృష్ణ 2003 మే 28న తిరుపతిలో జరుగుతున్న అధికార భాషా దినోత్సవంలో పాల్గొన వలసిందిగాను, "తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి: దేశంలో రెండవ అధికార భాష హోదా" అనేవిషయంపై ప్రసంగించ వలసిందిగాను ఆహ్వానించారు.

తిరుపతిలోని సువిశాలమైన "మహతి" అడిటోరియంలో జరిగిన ఆ మహాసభకు ముఖ్య అతిధి - అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. రాష్ట్ర హోమ్‌మంత్రి శ్రీ దేవేందర్‌గౌడ్‌, మరెందరో తెలుగు భాషావికాసానికి కృషిచేసిన పెద్దలు హాజరైనారు.