పుట:Molla Ramayanam.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ. త్రిశిరుఁ డంతఁ గనలి దివ్యాస్త్రసంపద
రాముమీఁదఁ జూపి రణ మొనర్చె,
మూఁడుశరము లతఁడు ముదలించి యట వాని
మూఁడుతలలఁ ద్రుంచె మొగ్గరమున. ||18||

వ. ఇట్లు ఖరాది రాక్షసుల శిక్షించి జయంబు గొని ధను వెక్కు డించి మరలి పర్ణశాల కేతెంచి తమ్ముఁడును దానును సమ్మదంబునం గలిసి యున్నసమయంబున; ||19||

శుర్పణఖ వల్ల సీతా సౌందర్యమును విన్న రావణుని కామాంధత

చ. చలమున వంత శూర్పణఖ సయ్యన లంకకు నేఁగి రావణుం
గొలువునఁ గాంచి మ్రొక్కి తనకున్ నౄపసూనులు సేసినట్టి చేఁ
తలు వినుపించి వారు తమ తండ్రి యనుజ్ఞను వచ్చి కానలో
పలఁ దిరుగాడుచందములుఁ బన్నుగ నేర్పడఁ జెప్పి పిమ్మటన్ ||20||
క. ఆ రాము భార్య విభ్రమ
మేరాజతనూజలందు నెఱుఁగము విను మున్
ధారుణిలోపలఁ గామిను
లారమణికి సాటిఁ బోల రభినుతిఁ జేయన్. ||21||

సీ. కన్నులు కలువలో కాము బాణంబులో
తెలివిగా నింత్కిఁ దెలియ రాదు,
పలుకులు కిన్నెర పలుకులో చిలుకల
పలుకులో నాతి కేర్పఱుపరాదు,
అమృతాంశుబింబమో యద్దమో నెమ్మోము
తెంపుతో సతికి భావింపరాదు
కుచములు బంగారు కుండలో చక్రవా
కమ్ములో చెలి కెరుంగగరాదు

తే. కురులు నీలంబులో తేఁటిగుంపు లొక్కొ
పిఱుఁదు పులినంబొ మన్మథు పెండ్లియరుఁగొ