Jump to content

పుట:Molla Ramayanam.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన దంతావళవాజిరత్నరథనానా యోధసంఘంబుతో
డ నమాత్యద్విజబంధువర్గముతోడం గూడి వాద్యంబులన్
జనుదెంచెన్ భరతుండు రాముకడకున్ సద్భక్తియేపారగన్ ||37||

సీ. చనుదెంచి రామునిచరణంబులకు మ్రొక్కి,
కై కేయి చేసి కపటమునకు
నగరంబు విడిచి యీ పగిది ఘోరారణ్య
మన కిట్లు రా నేల మునుల పగిది
నది గాక మనతండ్రి యత్యంత మైనట్టి
పుత్ర శోకంబునఁ బొక్కిపొక్కి
త్రిదశాలయమ్మున దేవేంద్రుఁ గనఁ బోయె,
నని చెప్ప విని రాముఁ డంతలోన
తే. భరతలక్ష్మణశత్రుఘ్న ధరణిసుతలఁ
గూడి దుఃఖించి దుఃఖించి కొంతవడికి
నాప్తవర్గంబుచే మానె నంతమీఁద
భరతుఁ డిట్లనె శ్రీరామభద్రుతోడ; ||38||
తే. రాజు లేకున్నచో మఱి రాష్ట్ర మందుఁ
గార్య మెట్లౌను మీ రెఱుంగనిది కలదె
నేఁటిసమయానఁ బట్టంబు నిలుపుకొనఁగఁ
దిరిగి విచ్చేయుఁ డనుడు నా భరతుతోడ. ||39||
వ. శ్రీ రామచంద్రుం డిట్లనియె ||40||
చ. జనకుఁడు సేసినట్టిమితిఁ జక్కఁగఁ దీర్చ కడంక నేను వ
చ్చిన గుఱిదాఁక, భూతలముఁ జేకొని రాజ్యముఁ జేయు మాట గా
దనకు మటన్న నొల్ల నన నాతనికిం దనపాదుకాయుగం
బొనరఁగ నిచ్చి పొమ్మనుచు నుర్వికిరాజుగఁ బంచె సొంపుగన్ ||41||