పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

మీఁగడ తఱకలు


కొందఱు లోకవ్యవహారానుగుణముగా నాబాలసుగ్రహమగు తెఱఁగున వచనము రచింపవలయు ననునభినివేశముతోఁ గావలయు శబ్దలక్షణాదికమును సైత మంతగాఁ బాటింపరైరి. ఎంతయేని సలక్షణమును బ్రౌఢమును నగుపద్యకవిత్వమున నాఱితేరిన పుష్పగిరి తిమ్మన్న రచించినవచనమును గొండొకపట్టులందు వ్యాకరణమును నిరాకరించు చున్నది. ఇప్పటికి నాకుఁ జేకుఱిన వచనగ్రంథములలోఁ దొల్తటిది

వచనభారతము

ఈ గ్రంథమునుగూర్చి తెలిసికొనవలసినయంశ మెక్కువ కలదు గావున మునుమున్న యిందలి యాశ్వాసాంతగద్యముఁ జదువుదము.

“ఇది శ్రీరామచంద్రచరణారవిందసేవాభినందనపవననందన వరప్రసాదాసాదిత గీర్వాణాంధ్ర కర్ణాటకాది నానాభాషా కావ్యరచనాచతుర, శ్రీమన్మహారాజాధిరాజరాజపరమేశ్వరరాజమార్తాండ ప్రౌఢప్రతాపాప్రతిమ వీరనరపతిబిరుద తెంబరగండబిరుదాంకిత శంఖచక్రమకరనుత్స్య హనూమద్గరుడ గండభేరుండ సింహశరభసాల్వాది నానావిధదేవార్హ ధ్వజాంకిత యుదవవంశతిలక, అంగ వంగ కళింగ కాశ్మీరలాటాంధ్ర ద్రవిడ ద్రావిడాది నానాదేశాధీశ్వర కిరీటకోట సంఘట్టనత్రస్తనిస్తులనివరత్న పరాగపరాగితనిజభవనద్వారాసక్తానేకజనపాలఫాలతలఘటితాంజలి పుంజ రంజితారవిందక (ప) రాయమాణ సభాస్థానస్థ సింహాసనాధిరూధ నానావిద్వదభీష్ట వరప్రసాద దేవరాజచిక్కదేవరాజకరుణా ప్రాప్త కర్ణాట రాజ్యలక్ష్మీ నృత్యరంగాయమాణ శ్రీరంగపట్టణపరిపాలనాథాదృత 'సైన్యాధిపత్య నిర్వాహక' మహారాష్ట్రమదేభపంచానన, కేళాదివంశాటవీ దావదహన, మథురానాథమదవిమర్దన, జయాఘాటశిరః కందుకక్రీడన, యస మంతరాయ నాసికాకృంతన, నింమోజిసమూలోన్మూలన, దాదోజిప్రాణ హరణ, దండధర ప్రతాప శిలవిఠల ఫాలేరాయ ఫాలాక్షరవిదలన,