పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

మీఁగడ తఱకలు


ననేకమంత్రములను (?) జెప్పె నని - నైషధాదికావ్యములకు జ్యౌతిష గ్రంథములకు వ్యాఖ్యలు రచించె నని - చెప్పఁబడినది.

కోలచెలమల్లినాథకృతులుగా నానైషధాదివ్యాఖ్యలను వాని గద్యములనుబట్టి మన మిప్పుడు తెలిసికొనుచున్నాము. కాని యిప్పు డుదాహరింపcబడినశ్లోకము లాగ్రంథములు రచించినవాఁడు మల్లినాథుఁడు గాక యాతనితమ్ముఁడుఁ-పెదిభట్టారకుఁడని చెప్పుచున్నవి. లోకమునఁ గూడఁ బెద్దిభట్టే గ్రంథకర్త యనియు నాతఁడు తన గ్రంథముల నన్నగారగుమల్లినాథునిపేరఁ బ్రకటించె ననియు విద్వత్పరంపరనుండి యైతిహ్య మొకటి వినవచ్చుచున్నది. అట్లు ప్రకటించుటకుఁ గారణముగా నీక్రింది కథకూడ నున్నది.

“మల్లినాథుడును బెద్దిభట్టు నన్నదమ్ములు. మల్లినాథుఁడు మందబుద్ధి గలవాఁడు. పెద్దిభట్టు పెద్దబుద్ధి కలవాఁడు. వీరు నివసించు గ్రామముచేరువ నడవిలో నొకయోగీశ్వరుఁడు తపస్సు చేసికొనుచుండెను. మందబుద్ధి యగుమల్లినాథుఁడు తత్పరతతో నా యోగీశ్వరుని శుశ్రూషించు చుండెను. పెద్దిభట్టును సకృత్తుగా సందర్శించుచుండెడివాఁడు. మల్లినాథుఁ డొకప్పుడు కార్యవశమున గ్రామాంతరమున కరిగెను. అన్నగారిచే నాజ్ఞప్తుఁడై యప్పుడు పెద్దిభట్టా యోగి నారాధించుచుండెను. అది యా యోగికి నిర్యాణకాలమయ్యెను. మల్లినాథుఁడు దగ్గఱ లేఁ డయ్యెను. తన కిన్నాళ్లు చేసిన శుశ్రూషకై యాయోగి మల్లినాథునకు సారస్వతము నుపదేశించి యుద్ధరింపఁదలఁచెను. కాని యట్లు తటస్థింప దయ్యెను. అప్పుడు సేవించుచుఁ జెంత నున్న పెద్దిభట్టును జూచి మీయన్నకుఁ జేయఁ దలంచుకొన్నయుపదేశము నాతని యసన్నిధిచే నీకుఁ జేయుచున్నాను. దీనిఫలము మీయన్న గారికే చెందఁజేయుదువు గాక యని యొకమంత్ర ముపదేశించి యాయోగిసిద్ధిపొందెను. పెద్దిభట్టంతతో మహోపాధ్యాయుఁ డయ్యెను. గుర్వాజ్ఞ చొప్పున నాతఁడు తాను రచించిన గ్రంథముల నన్నింటిని నన్నగా రగుమల్లినాథునిపేరనే ప్రకటించెను". ఈ కథ మీఁది శ్లోకములకుఁ దోడుపలుకుచున్నది.