పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

145


మల్లినాథుని వైదుష్యము

గ్రంథములందు మల్లినాథుఁ డని పేరున్నది. కావున నాపేరే పేర్కొనియెదను. ఈయన స్వతంత్రగ్రంథము లంతగా రచించినట్టు కానరాదు. హెచ్చుగా వ్యాఖ్యాన గ్రంథములే యగపడుచున్నవి. రఘువంశ కుమారసంభవ మేఘసందేశకిరాతార్జునీయశిశుపాలవధములకుఁ బంచకావ్యము లన్నపేరు కల్గుటయును, సంస్కృతభాష నభ్యసించు విద్యార్థు లీగ్రంథములనే ప్రధానముగా నారంభించి చదువుటయును, సుగమము లైనమల్లినాథవ్యాఖ్యలు వెలసినతర్వాతనే యేర్పడిన దని కొందఱు తలంచుట కలదు. కాని, తార్కికరక్షటీకలో మల్లినాథుఁడే "స్ఫుటీకృతం చైత దస్మాభిః పంచకావ్యటీకాసు" అనుటవలన నాయన నాఁటికే యాగ్రంథములకుఁ బంచకావ్యసంజ్ఞ కల దని యేర్పడుచున్నది. ప్రధానముగా విద్యార్థు లాగ్రంథములనే చదువుటకుఁ గారణము మల్లినాథ వ్యాఖ్యలు కావచ్చును. రఘువంశాదికావ్యములకు మల్లినాథునకుఁ బూర్వకాలమందే పదులకొలఁది వ్యాఖ్య లున్నవి. కాని యీయనవ్యాఖ్యలు వెలసినతర్వాత వానికిఁ బ్రచారము తగ్గినది. ముద్రణాదిసౌకర్యము లేనియాకాలముననే మనమల్లినాథుని గ్రంథము లాసేతుశీతాచలము వ్యాపించినవి. ఇట్టి వ్యాప్తికి వానిఘనతయే కారణము. ఇది యాంధ్రు లభిమానింపఁదగిన విషయము. "దుర్భోధ మయినపట్టును - స్పష్టార్ధమ్ - అని విడుతురు. స్పష్టార్ధ మగుపట్టును వ్యర్ధముగా దీర్ఘసమాసాదులతో నింపి విస్తరింతురు. అస్థానమున ననుపయోగము లగుజల్పములచే భ్రమము కలిగింతురు" అని కువ్యాఖ్యాతలను గర్హించిన భోజునిత్రోవ నీతఁడు చక్కఁగాఁ ద్రొక్కినాఁడు. "ఇహాన్వయముఖే నైవసర్వం వ్యాఖ్యాయతే మయా! నామూలం లిఖ్యతే కించి న్నానపేక్షిత ముచ్యతే' అన్వయముఖముననే సర్వమును వ్యాఖ్యానము చేయుదును. మూలములేనిది కొంచెముకూడ వ్రాయను. అనావశ్యక మయినది చెప్పను" - అని మల్లినాథునిశపథము. కాళిదాసాదిమహాకవుల కావ్యములకును నింక నితరశాస్త్రగ్రంథములకును