పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

మీఁగడ తఱకలు

మీఁదిశోకములందు వారియింటిపేరు "కొలచెలమ"వా రని యున్నది. ఈవంశమువారికి ఓరుఁగల్లు రాజధానిగా రాజ్యమేలిన ప్రతాపరుద్ర చక్రవర్తితోను రాచకొండ రాజధానిగా రాజ్యమేలినసర్వజ్ఞసింగభూపాలుని తోను సంబంధము గల దని యీశ్లోకములు చెప్పుచున్నవి. వీరియింటిపే రగుకొలచెలమ గ్రామముకూడ నక్కడకుఁ జేరువగా నుండcదగును. కొలచెలమగ్రామనామ మని - యది యోరుఁగల్లు రాచకొండల చేరువను గల దని - యీ క్రింది వెలుగోటివారి వంశప్రశస్తిపద్యములు చెప్పుచున్నవి. స్రగ్దర. వీరుం డా యాచపృథ్వీవిభుఁడు .......... ఘోరాజిన్ ధాటిఁ జెల్లం గొలచెలమపురీఘోటికాకోటిఁ దెచ్చెన్.

సీ|| కొలచెల్మకాడను బలియుఁడై తురకలఁ గొట్టి యశ్వములను బట్టినాఁడు

ఇట్లు చూడఁగాఁ బురాణములందలి కోలాచలమూగాని, శ్రీకోలాచలం శ్రీనివాసరావు మొదలగువారు నిశ్చయించిన పందిపాడుగాని,కన్యాకుమారి కడ నున్న కొలచెర్లకాని, మల్లినాథసూరి యింటి పేరుగా నేర్పడిన గ్రామము కా దనవచ్చును. ఇంటిపేరు కొలచెలమ యని నిర్ణయించుకొందము.

కొలచెలమ మల్లినాథుఁడు.

ఈయన శతావధానము చేసి విఖ్యాతిఁ గాంచినవాఁడు. నేఁటి కాలమున నస్మద్గురువర్యులు శ్రీ తిరుపతివేంకటేశ్వరు లఖండప్రతిభతో నాచరించుచున్నట్టియు నాంధ్రదేశమందే విపుల ప్రచారము గల్గినట్టియు నీశతావధాన మానాc డీమల్లినాథసూరి నిర్వహించినాఁడు. మనకుఁ దెలియవచ్చిన శతావధానచతురులలో నెల్ల నీతఁడే ప్రాచీనతముఁడు. అద్భుతప్రతిభాప్రదర్శక మైనయాశతావధానచాతుర్యమునకు మెచ్చి కాకతీయప్రతాపరుద్రచక్రవర్తి మనపండితపరమేశ్వరునకుఁ గనకాభిషేక సత్కారము గావించినాఁడు.