పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

మీఁగడ తఱకలు


అనుపద్యమువలనఁ బాలగుమిభీమయశిష్యుఁ డనియు నెఱుక పడుచున్నది. దీనినిఁబట్టి యన్నయకుటుంబము వారును సహజముగా శైవాచారసంపత్తికలవా రనియు, తెనాలిరామలింగస్వామిభక్తులనియు, బాలగుమివారిశిష్యు లనియుఁ దలఁపఁ గూడును.[1] మనప్రస్తుత గ్రంథ మగునుద్భటచరిత్రమును రచించిన రామలింగకవి యిట్టిలక్షణములు గలవాఁడు. ఆతని శైవాచారనిరతి యుద్భటచరిత్రమున స్పష్టముగాఁ గన్పట్టుచన్నది. మఱియు నాతఁడు 'రామేశ్వరస్వామి రమణీయకరుణా విశేషపోషిత విలసిత సమగ్ర, సహజసాహిత్యమాధురీసంయుతాత్ముఁడు' ననియు 'పాలగుమేలేశపదపయోజద్వయీధ్యానధారణసముదాత్త చిత్తుఁడ' ననియుఁ జెప్పకొన్నాఁడు. పాలగుమియేలేశ్వరుఁడును బాలగుమి భీమేశ్వరుఁడును నన్నదమ్ములో తండ్రికొడుకులో యయి యుందురు.

మఱి యన్నయ తనయన్న యని రామలింగనిఁ (లేక రామకృష్ణుని) బ్రస్తుతింపకున్నంతమాత్రాన వారి సౌదర్యవిషయము సందేహింపఁ దగిన దేమో యనరాదు. తెనాలిరామభద్రకవి తనతాత లన్నదమ్ములు ముగ్గురనియు, మొదటివాఁడు పాండురంగమాహాత్మ్యకర్త రామకృష్ణుఁ డనియు, రెండవవాఁడు తన తండ్రితండ్రి శ్రీగిరి యనియు, మూఁడవవాఁడు సుదక్షిణాపరిణయకర్త యునియు స్పష్టముగాఁ జెప్పినాఁడు గాన యిట్టిసందేహమునకు సందు లేదు.

అన్నయకవి మతము మార్చుకొన్నాఁ డన్నయనాదరముచే నన్నగారిని బ్రస్తుతింపకపోయెనేమో! 'సహజశైవాచార' యన్నపద మాయన్న నడుమఁ దెచ్చుకొన్నవైష్ణవాచారముమీఁది వైమనస్యముచేఁ

  1. పాలగుమివా రారాధ్యులు గాఁబోలును రామలింగకవి కింకను నూఱేండ్లకు ముం దొకఁ డాయింటిపేరివాఁడు శైవాచార్యుఁడు కొండవీటి రెడ్డిరాజ్యమున నున్నట్టు శాసనమున్నది. శ్లో. పాల్గుమిశ్రీకంఠగురో పంచాక్షరీమంత్రపౌనరుక్త్యస్య శిష్యాయ శిష్యపరిషద్రక్షా దాక్షిణ్యసత్కటాక్షస్య శక 1336 నాఁటిది పెదకోమటి మాచారెడ్డిశాసనము. శృంగార శ్రీనాథము కనుబంధము చూచునది.