పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

97

దీనింబట్టి చూడఁగాఁ బాండురంగమాహాత్మ్యాదులను రచించిన తెనాలిరామకృష్ణకవియును, సుదక్షిణాపరిణయము రచించిన తెనాలి యన్నయ కవియును నన్నదమ్ము లని యేర్పడు చున్నది. దీనికి సరిగానే సుదక్షిణాపరిణయమున

గీ|| నవ్యసుగుణాభిరామ తెనాలిరామ
     పండితాగ్రణిసత్పుత్త్రు భవ్యమిత్రు
     హరపదాంభోజసౌముఖ్య నన్న పాఖ్యు
     నన్నుఁ బిలిపించి యాదరోన్నతి వహించి,

గద్యము "ఇది శ్రీమత్తెనాలి రామేశ్వరశాశ్వతకృపాకటాక్షలక్షిత కవితాభిరామ రామయపండితకుమార సహజ శైవాచారసంపన్నధీమదన్న యనామధేయప్రణీతం బైనసుదక్షిణాపరిణయమందు" అని యున్నది.

ఈ సుదక్షిణాపరిణయపద్యములవలనఁగూడఁ దెనాలి రామకృష్ణుఁడు, తెనాలియన్నయ, యన్నదమ్ము లగుట యితర ప్రమాణ నిరపేక్షముగానే యేర్పడుచున్నది. ఇర్వురును రామయపండితుని కొడుకులే, తెనాలివారే, ఒకకాలమువారే. (అదిముందు తెలియనగును.) అంతేకాక రామలింగఁడే రామకృష్ణుఁ డయ్యె ననుటనుగూడ నీసుదక్షిణాపరిణయమే స్వతంత్రముగా సాధించుచున్నది. ఉదాహృతగద్య పద్యముల వలన నన్నయ సహజశైవాచారుఁ డనియుఁ దెనాలిలో వెలసిన రామేశ్వరస్వామి యనుగ్రహమునఁ గవిత నేర్చినవాఁ డనియు, మఱియు,

గీ|| కాళిదాసాది సంస్కృతకవులఁ దలఁచి
     యాంధ్రభాషావిశేషభాషాధిపతుల
     నన్న పార్యాదులను బుద్ధి సన్నుతించి
     పాలగుమిభీమగురుని సద్భక్తిఁ గొలుతు.